1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (00:02 IST)

వాస్త‌వాల‌ను ఆస‌క్తిగా చూపించిన గ‌మ‌నం

Gamanam poster
న‌టీన‌టులుః శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ త‌దిత‌రులు
 
సాంకేతిక‌తః ద‌ర్శ‌కురాలుః సుజనా రావు, నిర్మాత‌లుః రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్.
 
గ‌మ‌నం క‌థ విన్న‌వెంట‌నే కన్నీళ్ళు పెట్టుకున్నాన‌ని శ్రియా శ‌ర‌న్ తెలియ‌జేసింది. ద‌ర్శ‌కురాలిగా ఎక్క‌డా చేయ‌కుండా నిర్మాత అయిన‌ త‌న తండ్రితోపాటు షూటింగ్‌కు హాజ‌ర‌యి ప‌రిశీల‌న‌తో ద‌ర్శ‌కురాలిగా మారిన సుజ‌నారావు చేసిన ప్ర‌య‌త్న‌మిది. మూడు క‌థ‌ల‌తో వారి జీవితంలో ఏమి జ‌రిగింద‌నేది అంశంగా తీసుకున్నారు. ఈరోజే విడుద‌లైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
 
హైదరాబాద్ లో ఓ ప్రాంతంలో కమల (శ్రియ సరన్) వుంటుంది. ఆమె దివ్యంగురాలు. దర్జీ పని చేస్తూ తన చిన్నారిని పోషించుకుంటూ వుంటుంది. తనకు వినికిడి లోపం ఉందనే భర్త కూడా వదిలేస్తాడు. దాంతో నిస్సహాయురాలిగా ఓ బస్తీలో జీవిస్తూ ఉంటుంది. మ‌రోవైపు అలీ (శివ కందుకూరి) చ‌దువుక‌న్నా క్రికెటర్ కావాలని పట్టుదలతో ప్రాక్టీసు చేస్తుంటాడు. చ‌దివి ఉద్యోగం చేసుకోవాల‌ని త‌ల్లిదండ్రులులేని శివ‌కు తాత చెప్పినా విన‌డు. శివ‌ను జరా (ప్రియాంక జవాల్కర్) ప్రేమిస్తూ ఉంటుంది. పారిపోయి వ‌చ్చేస్తుంది కూడా. ఇంకోవైపు ఇద్దరు వీధి బాలురు గుజరీ సామాను అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. అయితే వారిలో ఒకరు తన బర్త్ డే కి కేక్ కట్ చేసి గ్రాండ్ గా సెలెబ్రెట్ చేయాలనుకుంటాడు. అందుకు కావాల్సిన డబ్బును పోగు వేయడానికి వివిధ రకాలుగా కష్టపడుతుంటారు. ఈ మూడు క‌థ‌ల‌కు భారీ వ‌ర్షం కేంద్ర‌బిందువు అవుతుంది. వ‌ర‌ద‌ల్లో వారు ఎలా చిక్కుకున్నారు. బ‌య‌ట‌ప‌డ‌డానికి వారు ఎంత క‌ష్ట‌ప‌డ్డారు? చివ‌రికి వారి గ‌మ‌నం ఎలాంటి ముగింపు ప‌డింది. అనేది సినిమా.
 
విశ్లేషణ:
 
విధి వ‌ర‌ద రూపంలో మూడు క‌థ‌ల్లోని వ్య‌క్తుల జీవితాల‌తో ఎలా ఆడుకుంది అనేది ప్ర‌ధానంగా చూపించారు. ఆమ‌ధ్య హైద‌రాబాద్‌తోస‌హా ప‌లు చోట్ల కురిసిన‌ వ‌ర‌ద‌ల‌కు లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం కావ‌డం, ఇంటిలోకి నీరు రావ‌డం, తేళ్లు, పాములు కూడా వ‌చ్చాయ‌ని కొన్ని ప్రాంతాల్లో వార్త‌లు రావ‌డం తెలిసిందే. ద‌ర్శ‌కురాలు తొలిసారిగా వ‌ర్త‌మానానికి త‌గిన విధంగా క‌థ‌ను రాసుకుని ఆవిష్క‌రించ‌డం అభినంద‌నీయ‌మే. రొటీన్ సినిమాలు కాకుండా చిన్న‌పాటి పాయింట్ తీసుకుని అందులోనే అన్ని ఎమోష‌న్స్‌ను, సాటి మ‌హిళ‌గా శ్రియ పాత్ర‌లో వున్న అంత‌ర్గ‌త పోరాటాల‌న్ని చ‌క్క‌గా ఆవిష్క‌రించారు.
 
భర్త చేతిలో మోసపోయి నిరాదరణకు గురైన ఓ దివ్యంగురాలి పాత్రలో శ్రియ జీవించింద‌నే చెప్పాలి. వ‌ర‌ద ఇంటిలో రావ‌డం బ‌య‌ట‌కు రావాల‌నుకు క్ర‌మంలో డోర్ లాక్ కావ‌డం, పాములు, తేళ్ళు కూడా వ‌ర‌ద‌తోపాటు ఇంటిలోకి రావ‌డం ఆ త‌ర్వాత ఆమె ప‌డిన మాన‌సిక క్షోభ హృద‌యాల‌న్ని ట‌చ్ చేస్తుంది. బ‌హుశా నిజ‌జీవితంలో క‌రోనా టైంలో ఆమె విదేశాల్లో అనుకోకుండా చిక్కుకుపోవ‌డం, ఓ ద‌శ‌లో ప‌లుక‌రించేవారే లేక‌పోవ‌డం వంటి సంఘ‌ట‌న‌లు ఆమెకు ఈ పాత్ర‌ను జీవించేలా చేశాయ‌నిపిస్తుంది.
 
హీరో శివ కందుకూరి అంతర్జాతీయ ఆటగాడిగా గుర్తింపు పొందాలనే క్రీడాకారుని పాత్రలో మెప్పించారు. క్లయిమాక్స్ లో వరదల్లో చిక్కుకున్న చిన్నారులను కాపాడే సీన్స్ లో ఆకట్టుకున్నాడు. అతనికి. జంటగా నటించిన ప్రియాంక జవాల్కర్ ముస్లిం యువతి పాత్రలో మెప్పించారు.  తాత‌గా చారుహాస‌న్ స‌రితూగారు. వీధి బాలురుగా నటించిన ఇద్దరు చిన్నారులు కూడా  మొదటి నుంచి చివరి వరకు బాగా నటించారు. అతిథి పాత్రలలో నిత్యామీనన్ ఓ పాటలో మెరుస్తుంది.  రోడ్డు మీద బొమ్మలు అమ్ముకునే పాత్రలో బిత్తిరి సత్తి కనిపించి మెప్పించారు.
 
ఇలాంటి క‌థ‌కు సినిమాటోగ్ర‌ఫీ కీల‌కం. దానిని ఆయ‌న బాగా చూపించ‌గ‌లిగారు. ఇక ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హృదయానికి హత్తుకునేలా ఉంది. ఉన్నది ఒక్క సాంగే అయినా.. దాన్ని నిత్యామీనన్ ద్వారా శాస్త్రీయ గీతంతో క్లయిమాక్స్ లో కంపోజ్ చేయడం బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 
 
భారీ వర్షాలు వస్తే బస్తీల్లో పేదల బతుకు ఎలా ఛిద్రం అవుతుందో బాగా చూపించారు. జీవితంలో ఎదురయ్యే ఆటు పోట్లను ఎదుర్కొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఓ స్ఫూర్తి దాయక "గమనం" చూపించారు దర్శకురాలు సుజనా రావు. అయితే టేకింగ్ విష‌యంలో ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకుంటే తెలుగులో సుజనా రావు గొప్ప ద‌ర్శ‌కురాలు అవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.
రేటింగ్: 3/5