శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2019 (13:25 IST)

సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు.. #gaddhalakondaganesh రివ్యూ రిపోర్ట్ (video)

నటీనటులు: వరుణ్‌ తేజ్‌, పూజా హెగ్డే, అధర్వ మురళి, మృణాళిని రవి, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్‌
ఛాయాగ్రహణం: అయానంక బోస్‌
కథ: కార్తీక్‌ సుబ్బరాజ్‌
అడిషనల్‌ డైలాగ్స్‌: మిథున్‌ చైతన్య - మధు శ్రీనివాస్‌
నిర్మాతలు: రామ్‌ ఆచంట - గోపీనాథ్‌ ఆచంట
రచన - దర్శకత్వం: హరీష్‌ శంకర్‌
 
నాలుగు బుల్లెట్లు సంపాదించే రెండు వాడుకోవాలి. రెండు వుంచుకోవాలి.. అంటూ తెలంగాణ యాసతో వరుణ్‌తేజ్‌ చెప్పిన డైలాగ్‌తోనే 'వాల్మీకి' చిత్రం ఎలా వుండబోతుందో దర్శకుడు హరీష్‌ శంకర్‌ క్లారిటీ ఇచ్చేశాడు. దానికితోడు బిందెలతో.. 'దేవత' సినిమాలోని వెల్లువచ్చేనమ్మా గోదారి' పాటను పెట్టి యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. వెరసి ఈ చిత్రం తమిళ 'జిగర్‌ తండ'కు రీమేక్‌. అయితే చిత్ర టైటిల్‌ వాల్మీకి పెట్టినప్పటినుంచీ వాల్మీకి తెగకు చెందిన వారు అభ్యంతరాలు చెపుతున్నా.. ఆఖరికి హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాత్రిపూట 'గద్దలకొండ గణేష్‌'గా పేరు మార్చేశారు. అయితే అప్పటికే వాల్మీకిగా థియేటర్లలో వెళ్ళిపోయిన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం. 
 
 


కథ: అభిలాష్‌ (అధర్వ మురళి) దర్శకుడు కావాలన్నదే కోరిక. అసిస్టెంట్‌గా చేసిన చోట అవమానాలు ఎదుర్కొంటారు. కానీ అతనిలో ఫైర్‌ కనిపెట్టిన నిర్మాత మంచి కథతో ముందుకురా అంటూ అడ్వాన్స్‌ కూడా ఇస్తాడు. ఎలాంటి కథ చేయాలనేది తీవ్రంగా ఆలోచించి విలన్‌నే హీరోగా చేసే కథ కోసం వెతుకుతాడు. ఈ క్రమంలో ఆంధ్రా,తెలంగాణ సరిహద్దుల్లోని గద్దలకొండ అనే గ్రామంలో గణేష్‌ (వరుణ్‌ తేజ్‌) అనే గూండా గురించి అతడికి తెలుస్తుంది. ఆ ఊరికి వెళ్లి గణేష్‌ గురించి ఆరా తీసే క్రమంలో అనుకోకుండా గణేష్‌ వలలో చిక్కుతాడు. అప్పుడు గణేష్‌, అభిని ఏం చేశాడు? ఇంతకీ ఈ గణేష్‌ కథేంటి.. తర్వాత పరిణామాలేంటి అన్నది మిగతా కథ. 
 
విశ్లేషణ:
అందరినీ భయపెట్టే వ్యక్తి సెంటిమెంట్‌తో ఎలా మారాడన్నదే చిత్రంలోని పాయింట్‌. తమిళ చిత్రం చూస్తే అచ్చం కాపీనే అనిపిస్తుంది. చాలా సన్నివేశాలు డిటోగా దింపేశాడు. అక్కడ సిద్దార్థ్‌ చేసిన పాత్రను ఇందులో అధర్వ మురళి చేశాడు. ఊరిలో రౌడీగా నటించిన బాబీసింహ పాత్రను ఇక్కడ వరుణ్‌తేజ్‌ చేశాడు. ఈ కథలో ఇక్కడే కొత్తదనం దర్శకుడికి కన్పించింది. నాలుగేళ్ళ క్రితం వచ్చిన ఆ కథ వాతావరణ అంతా తమిళ నేటివిటీకి కరెక్ట్‌గా సరిపోయింది. మన దగ్గరకు వచ్చేసరికి పూర్తి 'రంగస్థలం' నేటివిటీ. 
 
అందుకే పాత చిత్రాల్ని చూసినట్లుగా అనిపిస్తుంది. గణేష్‌ పాత్రలో వరుణ్‌తేజ్‌ బాగానే చేశాడు. కొన్ని ఎమోషన్స్‌ బాగానే పండించాడు. కానీ తెలంగాణ యాస కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. పల్లెటూరిలో వున్న రాజకీయాలు, అహం బాగా తలకెక్కిన వ్యక్తులు ప్రజల్ని ఏవిధంగా పీడిస్తారనేది కోణంలో చాలా సన్నివేశాలు పాత సినిమాలను గుర్తుకు చేస్తాయి. కథకూడా అలాగే వున్నా సన్నివేశాలు కథనం కొత్తగా వుంటుంది. సీనియస్‌ మూవీలో సత్య పాత్ర ఎంటర్‌టైన్‌ చేస్తుంది. నటశిక్షకుడిగా బ్రహ్మాజీ పాత్ర కూడా వినోదాన్ని పండిస్తుంది.
 
దర్శకుడు హరీష్‌ శంకర్‌ విజయవంతం అయ్యాడు. పరిచయ సన్నివేశంతోనే గణేష్‌ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్‌ అయిపోతారు. వరుణ్‌ ఏ తడబాటు లేకుండా తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు.. సందర్భానుసారంగా భలేగా పేలాయి. గణేష్‌ కనిపించే తొలి సన్నివేశం తర్వాత అతడి క్రూరత్వాన్ని చాటిచెప్పే మరో రెండు సన్నివేశాలు కొంచెం రిపిటీటివ్‌ లాగా అనిపిస్తాయి. కానీ ఆ తర్వాత ఆ పాత్రను మలుపు తిప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌.. ప్రేక్షకుడిలో ఉత్కంఠ రేపుతుంది.
 
ద్వితీయార్ధంలో ప్రేక్షకుడి అంచనాలకు అందనిగా సాగుతుంది. మాతక గురించి తెలియిన వాళ్లు కచ్చితంగా ద్వితీయార్ధంలో కొత్త అనుభూతికి గురవుతారు. సినిమాలో సినిమా చుట్టూ మలుపు సాగే వ్యవహారం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ చాలా వరకు సాధారణంగా అనిపించి.. ఇంకెప్పుడొస్తుంది 'ఎల్లువొచ్చి గోదారమ్మా' పాట అని ప్రేక్షకులు ఎదురు చూసేలా చేస్తుంది. 
 
తమిళంతో పోలిస్తే హీరో తల్లి పాత్రకు ఇక్కడ ప్రాధాన్యం పెంచడం సెంటిమెంట్‌ కనెక్షన్‌ పెట్టడం బాగుంది. చివరిదశకంలోనైనా మెగాఫోన్‌ పట్టాలనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పాత్రలో తనికెళ్ల భరణి పాత్ర ఎమోషన్‌ పండించాడు. చివర్లో సుకుమార్‌, నితిన్‌ క్యామియోలు కొసమెరుపుల్లా ఉపయోగపడ్డాయి. అయితే నెరేషన్‌ స్లోగా సాగడంతో కొన్నిచోట్ల విసుగు కల్గిస్తుంది. 
 
సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్‌ సంగీతం సరికొత్తగా అనిపిస్తుంది. క్లాస్‌ టచ్‌ ఉన్న పాటలు, నేపథ్య సంగీతానికే పేరుపడ్డ అతను.. 'వాల్మీకి'లో పూర్తిగా మాస్‌ పాటలు, రీరికార్డింగ్‌ బాగా చేశాడు. 'జర్రజర్ర..'లో మాస్‌ బీట్స్‌ ఆకట్టుకుంటాయి. 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు హరీష్‌ శంకర్‌.. రీమేక్‌ తీయడంలో మరోసారి తన నేర్పరితనం చూపించాడు.
 
''నమ్మకం ప్రాణం లెక్క. ఒక్కసారి పోతే మళ్లీ తిరిగి రాదు'' లాంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. కథనంలో అక్కడక్కడా బిగి సడలినప్పటికీ.. అనేక హంగులు అద్ది సినిమాను అతను జనరంజకంగానే మలిచాడు హరీష్‌.  అయితే వాల్మీకి కులాన్ని ఎక్కడా ఇబ్బందిపెట్టిన సందర్భమే లేదు. గణేష్‌..పై సినిమా తీసే క్రమంలో 'వాల్మీకి' అనే టైటిల్‌ అనుకుంటారు. కానీ  దాన్ని వద్దని గణేష్‌ పాత్రతోనే చెప్పిస్తారు. 
 
రేటింగ్ - 3/5