శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (15:48 IST)

స్పై థ్రిల్లర్ 'గూఢచారి'... మూవీ రివ్యూ

గతంలో వచ్చిన 'క్ష‌ణం' చిత్రంతో హీరోగా త‌నేంటో ప్రూవ్ చేసుకున్నాడు అడివి శేష్. ఇపుడు రెండేళ్ళ విరామం తర్వాత మళ్లీ "గూఢచారి" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జేమ్స్ బాండ్ తరహాలో ఈ చిత్రం ఉంది. అందుక

చిత్రం : గూఢచారి 
నటీనటులు: అడవి శేష్, శోభితా ధూళిపాళ్ల, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సుప్రియ, వెన్నెల కిషోర్, మధు శాలినీ తదితరులు.,
కథ : అడవి శేష్
స్క్రీన్ ప్లే : అడవి శేష్, శశికిరణ్ తిక్క
సంగీతం : శ్రీచరణ్ పాకాల
నిర్మాతలు : అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
దర్శకత్వం : శశికిరణ్ తిక్క
విడుదల తేదీ : శుక్రవారం ఆగస్టు 3, 2018
 
గతంలో వచ్చిన 'క్ష‌ణం' చిత్రంతో హీరోగా త‌నేంటో ప్రూవ్ చేసుకున్నాడు అడివి శేష్. ఇపుడు రెండేళ్ళ విరామం తర్వాత మళ్లీ "గూఢచారి" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జేమ్స్ బాండ్ తరహాలో ఈ చిత్రం ఉంది. అందుకే టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే కథను కూడా అందించాడు అడవి శేష్. పైగా, స్క్రీన్‌ప్లే విష‌యంలో త‌న‌దైన స‌హాయ స‌హ‌కారాన్ని అందించాడు. అలా తెరకెక్కిన చిత్రం 'గూఢచారి'. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ చిత్ర కథ ఎలా ఉందో తెలుకుందాం.
 
కథ : 
అర్జున్ (అడవి శేష్) తండ్రి నేషనల్ సెక్యురిటీ ఏజెంట్‌గా పని చేస్తుంటాడు. ఓ ఆపరేషన్‌లో ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న అర్జున్... అదే ఏజెన్సీలో పనికి చేరుతాడు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని 'త్రినేత్ర' అనే మిషన్‌కు ఎంపికవుతాడు. పైగా, తన తండ్రిని చంపిన ఉగ్రవాదులను హతమార్చడమేకాకుండా దేశానికి మంచి సేవ చేయాలని భావిస్తాడు. ఆ ఉగ్రవాదులు ఆ ఎజెన్సీ పెద్దలను హతమార్చి ఆ నేరం అర్జున్ చేసినట్టుగా సృష్టిస్తారు కొందరు పెద్దలు. ఈ టెర్రరిస్టు గ్రూపు వెనుక ఉన్నది ఎవరు? అర్జున్ని ఎందుకలా టార్గెట్ చేశారు. ఆ తర్వాత అర్జున్ తెలుసుకున్న భయంకర నిజాలేంటి అనేదే పూర్తి కథ. 
 
నటీనటుల పాత్రలు : 
ఈ చిత్రంలో హీరోగా అడవి శేష్ నటన అద్భుతంగా ఉంది. గూఢచారి పాత్రలో అదరహో అనిపించాడు. ఇప్పటికే మంచి నటుడిగా తనను తాను నిరూపించుకున్న శేష్... ఇపుడు స్టార్ హీరో రేంజ్‌లో అద్భుతమైన యాక్షన్ పండించాడు. అటు రైటర్‌గా కూడా తన ముద్ర వేసి సినిమాకు వెన్నెముకగా నిలిచాడు. ఇకపోతే, శోభిత ధూళిపాళ్ళ చిత్రంలో అందాలను ఆరబోసింది. సీనియర్ నటులు జగపతి బాబు, ప్రకాష్ రాజ్‌లు మరోమారు కీలక పాత్రలో నటించారు. వెన్నెల కిషోర్‌ది భిన్నమైన పాత్ర. తన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు. చాలా రోజుల తర్వాత ఎంట్రీ ఇచ్చిన సుప్రియ అక్కినేనికి మంచి పాత్ర దక్కింది. తను బాగా చేసింది. మధుషాలిని, అనీష్ కురివిళ్లా తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.
 
టెక్నికల్ పరంగా... 
ఈ చిత్రంలో సాంకేతిక విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. అత్యున్నత స్థాయి నిర్మాణపు విలువలతో చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల గురించి.. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమాకు ప్రధాన బలమయ్యాడు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ స్లైడ్ పడేంతవరకు ప్రతీ సీన్‌ను తన మ్యూజిక్‌తో బాగా ఎలివేట్ చేశాడు. షానియల్ డియో సినిమాటోగ్రఫీ టాప్. పరిమిత బడ్జెట్‌లో చిత్రాన్ని చాలా బాగా నిర్మించారు. 
 
ఇటీవలికాలంలో వచ్చిన చిత్రాలతో పోల్చితో ఈ చిత్రం ది బెస్ట్‌గా నిలుస్తుంది. ఇది ఓ ఎంగేజింగ్ స్పై థ్రిల్లర్. ఆద్యంతం థ్రిల్ చేస్తూ, ఊహించని ట్విస్టులతో కట్టిపడేస్తుంది. మొత్తం క్రెడిట్ రైటర్ అడవి శేష్, డైరెక్టర్ శశికిరణ్ తిక్క‌లకే వెళుతుంది. బాగా రాసుకుని, అద్భుతంగా ప్రజెంట్ చేశారు. డైరెక్టర్ కొత్తవాడే అయినా ఇలాంటి స్పై సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. సినిమా మొదలైనప్పటి నుంచి చివరకు అలాగే మెయింటెన్ చేశాడు. 
 
నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన డీటెయిలింగ్, ప్రతి చిన్న లాజిక్‌తో సహా ప్రతీది పక్కాగా ప్రజెంట్ చేశారు. యాక్షనే కాకుండా, ఎమోషనల్‌గా కూడా ఈ సినిమా మెప్పిస్తుంది. తండ్రి కొడుకుల ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది. లిమిటెడ్ బడ్జెట్‌లో ఇంతమంచి ఔట్ పుట్‌ను ఇచ్చినందుకు టీమ్‌ను అభినందించాల్సిందే. ముఖ్యంగా అడవి శేష్ అటు రైటర్‌గా, ఇటు నటుడిగా రాణించాడు. ఈ చిత్రాన్ని ఓ స్టార్ హీరో చేసి ఉంటే చాలా పెద్ద సినిమా అయ్యుండేది. అయినప్పటికీ 'గూఢచారి' బాక్సీఫీస్ దగ్గర సత్తా చాటుతుంది.