బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (13:43 IST)

గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన విశ్వం ఎలా వుందంటే- విశ్వం రివ్యూ

Gopichand, Kavya Thapar
Gopichand, Kavya Thapar
నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, వెన్నెల కిషోర్, సీనియర్ నరేశ్, ప్రగతి, కిక్ శ్యామ్, బెనర్జీ, సునీల్, జిషుసేన్ గుప్తా తదితరులు.
సాంకేతిక సిబ్బంది: దర్శకత్వం: శ్రీను వైట్ల, సమర్పణ: దోనేపూడి చక్రపాణి, నిర్మాతలు: TG విశ్వ ప్రసాద్ & వేణు దోనేపూడి, క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్, సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల, డీవోపీ: K V గుహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, రైటర్స్: గోపీ మోహన్, భాను-నందు, ప్రవీణ్ వర్మ, ఫైట్ మాస్టర్: రవి వర్మ, దినేష్ సుబ్బరాయన్.
 
గోపీచంద్, శ్రీను వైట్ల ఇద్దరికీ కొంతకాలంగా సరైన హిట్లు లేవు. ఇప్పుడు ఇద్దరూ కలిసి వారిఫార్మెట్ లో ఎంటర్ టైన్ చేయాలని విశ్వం సినిమాతో ముందుకు వచ్చారు.  టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషన్లతో సినిమాపై క్రేజ్ ఏర్పాటు చేశారు. అందులో ఉగ్రవాదుల నేపథ్యం, ఓ పాప నేపథ్యం కూడా లింకు వున్నట్లు అనిపించాయి. ఇవి కథలో కొంత పార్ట్ మాత్రమే అని రిలీజ్ కు ముందు చెప్పారు. మరి వారి చెప్పినట్లుందా లేదా.. అని తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే.
 
కథ:
కేంద్రమంత్రి సుమన్ సోదరుడు సునీల్ ను ట్రాప్ చేసి శర్మ పేరు ముసుగులో వ్యాపారాలు చేస్తున్న ఓ టెర్రరిస్టు బండారం తెలుస్తుంది. ఈ విషయం సుమన్ కు సునీల్  చెప్పడంతో అది విన్న శర్మ సుమన్ ను చంపేస్తాడు. ఇది స్కూల్ పిక్నిక్ కు వచ్చిన ఓ పాప చూడడంతో ఆమెను చంపడానికి ట్రై చేస్తారు. ఇది తెలుసుకున్న పాప తాత  బెనర్జీ స్కూల్ మానిపిచ్చేస్తాడు. ఆ తర్వాత వారి జీవితాల్లోని అనుకోకుండా గోపిరెడ్డి (గోపీచంద్) వచ్చి పాపను కాపాడే బాధ్యతను తనపై వేసుకుంటాడు. ఈ క్రమంలో అక్కడ సీనియర్ నరేష్ ప్యామిలీతో పరిచయం కావడం, వారి కుమార్తె సమైరాను ఇటలీలో కలిసిన విషయాలు చెబుతాడు గోపీ. నరేష్ ఫ్రెండ్ కొడుకు తనేతనని గోపీ చెప్పి అందరినీ నమ్మిస్తాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనలతో అతను తన ఫ్రెండ్ కొడుకుకాదని తెలుసుకున్న నరేష్ ఏం చేశాడు? కావ్యథాపర్ ఏం చేసింది? పాపను ఎందుకు గోపీ కాపాడాలనుకున్నాడు? వీటికి సమాధానమే మిగిలిన సినిమా.
 
సమీక్ష:
విశ్వం అనే టైటిల్ పెట్టడానికి విశ్వంలో ఎన్ని విషయాలున్నాయో అవన్నీ ఇందులో వుంటాయని చెప్పినట్లుగానే దర్శకుడు చాలా సమస్యలను టచ్ చేస్తూ వెళ్ళాడు. టెర్రరిజం అనేది చిన్నపార్ట్ మాత్రమే అని ఎన్ని కబుర్లు చెప్పినా కీలకమైన అంశం అదే. గతంలో సాహసం అనే సినిమా పూర్తిగా ఆ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ తోపాటు లవ్, వినోదం, సెంటిమెంట్ కలగలిపి మిక్సిడ్ కర్రీలా చేశాడు. మొదటి నుంచి సీరియస్ సన్నివేశాలున్నా అవన్నీ ఎంటర్ టైన్ మెంట్ లో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
 
చాలా మంది తాను చేసిన వెంకీ సినిమా తరహా ఎంటర్ టైన్ మెంట్ కోరుకుంటున్నారని అందుకే ఈసారి ఆ ప్రయత్నం చేశానని చెప్పిన శ్రీనువైట్ల ఆ తరహా వినోదాన్ని బేస్ చేసుకున్నాడు. కనుకనే సెకండ్ పార్ట్ లో ట్రెయిన్ ఎపిసోడ్ లో వెన్నెలి కిశోర్ తోపాటు పలువురు కమేడియన్లతో వినోదాన్ని పండించాడు. వెంకీ సినిమాకూ దీనికి చాలా వ్యత్యాసం వుంది. ట్రెయిన్ ఎపిసోడ్ లో టెర్రరిస్టులు, చెడ్డీ గ్యాంగ్,  గోపీచంద్ కుటుంబం, టీసీ అందరూ జర్నీలో సాగే సన్నివేశం బాగా సింక్ అయింది. మొదటి పార్ట్ లో సీనియర్ నటుడు ప్రుధ్వీతో వచ్చే ఎపిసోడ్ కూడా చాలా ఫన్ తెప్పిస్తుంది.
 
కథ టెర్రిరిజం నేపథ్యం వుండడంతో చాలా పాత్రలు వచ్చిపోతుంటాయి. యాక్షన్ కూడా అందుకు భారీగానే వుంటుంది. పాటలు ఆటవిడుపుగా వున్నాయి. హీరోయిన్ ను మాగ్జిమమ్ యూత్ ను బేస్ చేసుకుని కాస్ట్యూమ్స్ వేయించాడు. మిగిలిన పాత్రలన్నీ వారివారి పరిధిమేరకు నటించాడు. ఈ సినిమాలో ఎటువంటి సందేశం లేదు. కేవలం ప్రేక్షకులకు వినోదాన్ని పంచి తాము మరలా మంచి సినిమా తీశామనే లాజిక్ తో తీశాడు. నిర్మాణపరంగా ఇద్దరు నిర్మాతలు వుండడంతో వాల్యూస్ బాగానే వున్నాయి.
 
నటనాపరంగా గోపీచంద్ బాగానే చేశాడు. డాన్స్ కూడా హీరోయిన్ తో సమానంగా చేశాడు.  టెర్రరిస్టుగా జిషుసేన్ గుప్తా, పాప తండ్రిగా కిక్ శ్యామ్ నటించారు. చనిపోాయారనుకున్న వారిని సినిమాటిక్ గా బతికించి తెలుగు సినిమాకు న్యాయం చేశాడు. అయితే చాలామందికి రొటీన్ ఫార్మెట్ లో అనిపించినా ఎక్కడా బోర్ కొట్టకుండా చేయడం దర్శకుడి పనితనమే అని చెప్పాలి. 
 
సంభాషణలపరంగా సెటైర్లు బాగున్నాయి. సినిమాటోగ్రఫీతోపాటు సంగీతం బాగుంది. నేపథ్యం సంగీతం అమరింది.  కొన్ని చోట్ల కంప్యూటర్ గ్రాఫిక్స్, ఎడిటింగ్ కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. విశ్వంను కుటుంబంతో చూడతగ్గ సినిమాగా చెప్పవచ్చు.
రేటింగ్ : 3 /5