బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (20:54 IST)

థ్రిల్ క‌లిగించే `ఏప్రిల్ 28 ఏం జరిగింది`

Ajay, Ranjit, Ferri Agarwal
నటీనటులు: డా.రంజిత్, షెర్రీ అగర్వాల్, తనికెళ్లభరణి, అజయ్, చమ్మక్‌చంద్ర
బ్యానర్: వీజీ ఎంటర్‌టైన్‌మెంట్స్, దర్శకత్వం: వీరాస్వామి, సంగీతం: సందీప్‌కుమార్,
విడుదల తేదీ: శ‌నివారం, ఫిబ్రవరి 27, 2021.
 
ఇటీవ‌లే `ఏప్రిల్ 28 ఏం జరిగింది` సినిమాను చూసిన నిఖిల్, బిగ్‌బాస్ ఫేం సోహైల్ త‌మ‌కు బాగా న‌చ్చింద‌నే స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతా కొత్త‌వారితో తెర‌కెక్కిన సినిమాను డి. సురేష్‌బాబు సినిమాను చూసి మ‌రీ విడుద‌ల‌చేశాడు. అంత‌గా ఆయ‌న్ను ఆక‌ట్టుకున్న సినిమా శ‌నివారం విడుద‌ల‌కానుంది. ముందుగానే డి.సురేష్‌బాబు మీడియాకు చూపించ‌డం ఆన‌వాయితీ. ఇదివ‌ర‌కు కేరాఫ్ కంచ‌పాలెం కూడా ఇలానే చూపించారు. మ‌‌రి అంత ధైర్యంగా చూపించిన ఆ సినిమాలో ఏముందో తెలుసుకుందాం.
 
కథ:
సినిమా రచయిత విహారి (రంజింత్). త‌న నిర్మాత (త‌నికెళ్ళ‌భ‌ర‌ణి)కు క‌థ చెబుతాడు. న‌చ్చ‌లేదంటాడు. అప్ప‌టికే నాలుగు హిట్లు ఇచ్చిన విహారికి ఈ క‌థ‌పై పూర్తి న‌మ్మ‌కం వుంటుంది. దాన్ని మ‌రింత‌గా మెరుగులుదిద్ది వ‌స్తానంటాడు. భ‌ర్త ప‌రిస్థితి తెలుసుకున్న విహారి భార్య (షెర్రీ అగర్వాల్) ఏదైనా టూర్ వెళ‌దామంటుంది. అలా త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో కారులో బ‌య‌లుదేర‌తారు. ష‌డెన్‌గా ఓ చోట కారు రిపేరు వ‌స్తుంది. వెంట‌నే సెట్‌కావ‌డం, అక్క‌డే డ్యూటీనిమిత్తం వ‌చ్చిన పోలీస్‌ఆఫీసర్ (అజయ్) ప‌రిచ‌యంతో ఓ అతిథిగృహంలో బస చేస్తాడు విహారి. అప్పుడు విహారికి కొన్ని వింత సంఘ‌ట‌న‌లు జ‌రిగి క‌థ‌కు మంచి క్ల‌యిమాక్స్ వ‌చ్చేలా ప్రేరేపిస్తాయి. ఇదిలా వుండ‌గా, నిర్మాత తిర‌స్క‌రించిన‌ క‌థను ఆఫీసుకు వ‌చ్చిన ద‌ర్శకుడు రాజీవ్‌క‌న‌కాల చూసి వెంట‌నే సినిమా చేసేద్దామంటాడు. విహారి ఫోన్‌లో అందుబాటులో లేక‌పోవ‌డంతో త‌నే అత‌నున్న సిరిపురం ఊరికి బ‌య‌లుదేర‌తాడు ద‌ర్శ‌కుడు. ఆ త‌ర్వాత అక్క‌డ ఏం జ‌రిగింది? అనేది మిగిలిన క‌థ‌.
 
విశ్లేషణ:
ఇందులో క‌థ‌, క‌థ‌నం ఆస‌క్తి క‌లిగిస్తుంది. సాదాసీదాగా సాగిపోతున్న క‌థ‌లాగా ముందు అనిపించినా రానురాను ఊహించ‌ని మ‌లుపుల‌తో ప్రేక్ష‌కుడిని థ్రిల్ క‌లిగిస్తుంది. కొరియోగ్రాఫ‌ర్ నుంచి ద‌ర్శ‌కుడుగా మారిన‌ వీరాస్వామి ఇలాంటి థిల్ల‌ర్ అంశాన్ని ఎంచుకోవ‌డం విశేషం. ఇందులో ర‌చ‌యిత‌గా న‌టించిన డా. రంజిత్ క‌థ‌కు సూట‌య్యాడు. ఎక్క‌డా హీరోయిజం క‌నిపించ‌కుండా సినిమా ర‌చ‌యితలా పాత్ర‌తీరును ద‌ర్శ‌కుడు  డిజైన్ చేశాడు. ప్ర‌ధానంగా ఇంటర్వెల్ ట్విస్ట్‌లు, పతాక సన్నివేశ మలుపు ప్రేక్షకులు ఊహించ‌ని విధంగా వుంటాయి. ఇదే డి.సురేష్‌బాబులాంటి నిర్మాత‌ను సినిమా విడుద‌ల‌జేసేలా చేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. మొద‌టి భాగం సాదాగా సాగినా ఇంట‌ర్‌వెల్ త‌ర్వాత నుంచి ఆస‌క్తిక‌రంగా మారింది.
 
నిర్మాత‌గా తనికెళ్ల భరణి, సి.ఐ.గా అజ‌య్‌ పాత్ర‌లు వారికి కొట్టిన‌పిండే. చమ్మక్ చంద్ర భిన్న‌మైన వినోదాన్ని పండించాడు. సందీప్‌కుమార్ నేప‌థ్య‌సంగీతం ప‌ర్వాలేదు. సంభాష‌ణ‌ల‌ప‌రంగా ద‌ర్శ‌కుడు శ్ర‌ద్ధ‌తీసుకున్నాడు. మ‌న‌చుట్టూ వున్న పంచ‌భూతాలు, వృక్ష‌, జంతువులు, వ‌స్తువులు ప్ర‌తీదీ మ‌నిషికి ఏదో చెప్పాల‌ను చూస్తుంది. కాని దాన్ని అర్థంచేసుకునే శ‌క్తి మ‌నిషికిలేదు. భూకంపం వ‌స్తుంద‌ని ముందుగానే కొన్ని జంతువుల‌కు తెలుస్తుంది. ఇలా ర‌చ‌యిత‌గా అన్నిటిపై అవ‌‌గాహ‌న‌తో కూడిన సంభాష‌ణ‌లు బాగున్నాయి. కెమెరాప‌నిత‌నం ఓకే. సందీప్‌కుమార్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. 
 
అంతా కొత్త‌వారైనా ఎక్క‌డా ఆ వాస‌న క‌నిపించ‌దు. గంట యాభై నిమిషాలు ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది.రెగ్యులర్ చిత్రాలు చూసి విసిగి పోయిన వారికి ఈ చిత్రం మంచి రిలీఫ్ ఇస్తుంది. స‌స్సెన్స్‌, థ్రిల్ల‌ర్ త‌ర‌హా ప‌లు చిత్రాలు వ‌చ్చాయి. అయితే ఇలాంటి సినిమా స‌రికొత్త‌గా అనిపిస్తుంది. చిన్న‌పాటి లాజిక్కులు మిన‌హా బోర్ లేకుండా ఆద్యంతం థ్రిల్‌ను కలిగిస్తుంది.
రేటింగ్: 3/5