సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By pnr
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (19:46 IST)

'మాస్ మసాలా.. పైసా వ‌సూల్‌' రజినీకాంత్ "కాలా".. మూవీ రివ్యూ(Video)

రెండేళ్ళ గ్యాప్ తర్వాత తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం "కాలా". 'కబాలి' తర్వాత వచ్చిన చిత్రమిదే. వ‌య‌సు మీద ప‌డుతున్నా ఆయ‌న‌కున్న క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదని 'కాలా' చిత్రం మరోమారు నిరూపించిం

చిత్రం : కాలా 
నిర్మాణ సంస్థ‌లు: వ‌ండ‌ర్‌బార్ ఫిలిమ్స్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్‌
తారాగ‌ణం: ర‌జినీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, హ్యూమా ఖురేషి, ఈశ్వ‌రీరావు, షాయాజీ షిండే త‌దిత‌రులు
పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, వ‌న‌మాలి
సంగీతం: స‌ంతోశ్ నారాయ‌ణ్‌
నిర్మాత‌: ధ‌నుష్
ద‌ర్శ‌క‌త్వం: పా.రంజిత్‌
విడుదల తేదీ : గురువారం, జూలై 7, 2018.
 
రెండేళ్ళ గ్యాప్ తర్వాత తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం "కాలా". 'కబాలి' తర్వాత వచ్చిన చిత్రమిదే. వ‌య‌సు మీద ప‌డుతున్నా ఆయ‌న‌కున్న క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదని 'కాలా' చిత్రం మరోమారు నిరూపించింది. ఈ చిత్రంలో ముంబై ధారావి అనే ప్రాంతంలో నివశించే ఓ డాన్ త‌న ప్రాంతంలోని ప్ర‌జ‌ల కోసం ఏం చేశాడ‌నేదే ఈ చిత్ర కథ. ఇక ర‌జినీకాంత్‌కున్న మాస్ ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అందులో ఆయ‌న డాన్‌గా న‌టించాడంటే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడతాయి. అలాంటి అంచ‌నాలు న‌డుమ విడుద‌లైన కాలా ఎలా ఉంది? స‌గ‌టు సినీ అభిమానికి న‌చ్చుతుందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా క‌థను పరిశీలించాల్సిందే.
 
చిత్ర క‌థ‌: 
తమిళనాడు రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన తిరునల్వేలి పట్టణానికి చెందిన ఓ యువ‌కుడు క‌రికాల‌న్ అలియాస్ కాలా ‌(ర‌జినీకాంత్‌) ఉపాధి కోసం ముంబై న‌గ‌రంలోని ధారావి ప్రాంతానికి చేరుకుంటాడు. అక్క‌డ ప్ర‌జ‌ల క‌ష్ట సుఖాల్లో వారికి అండ‌గా నిల‌బ‌డి వారి నాయ‌కుడుగా ఎదుగుతాడు. అక్క‌డే జ‌రీనా(హ్యూమా ఖురేషి)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. చివ‌ర‌కు సెల్వి(ఈశ్వ‌రీరావు)ను కాలా పెళ్లి చేసుకుంటాడు. ధారావి ప్రాంతం పేద ప్ర‌జ‌ల‌కు చెందింది. అక్క‌డున్న హిందూ ముస్లింలు సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తుంటారు. 
 
అయితే ఆ ప్రాంతాన్ని ఆధీనం చేసుకోవాల‌ని హ‌రినాథ్ దేశాయ్‌(నానా ప‌టేక‌ర్‌) వంటి రాజ‌కీయ నాయ‌కుడు ప్ర‌య‌త్నిస్తాడు. తామున్న చోటును వ‌దిలి పేదప్ర‌జ‌ల ఎక్క‌డికి పోతారు. అందువ‌ల్ల వారు కాలా నాయ‌క‌త్వంతో ఎదురుతిరుగుతారు. అనుకున్నప‌ని కాక‌పోతే మ‌న రాజ‌కీయ నాయ‌కులు వారిమధ్యే గొడ‌వ‌లు సృష్టిస్తారు. అప్పుడు కాలా ఏం చేశాడు? త‌న ప్రాంత ప్ర‌జల‌ను ఒక్క‌టి చేసి ఎలా పోరాడుతాడు? అనేది మిగిలిన చిత్ర కథ. 
 
చిత్ర సమీక్ష‌: 
క‌రికాలుడు అలియాస్ 'కాలా'గా ర‌జినీకాంత్ త‌న‌దైన మాస్ పెర్‌ఫార్‌మెన్స్‌తో ఆక్టుకున్నారు. సినిమా అంతా ఆయ‌న చుట్టూనే తిరుగుతుంది. క‌బాలిలో ఫ‌స్టాఫ్‌లో రజినీకాంత్‌ను మాస్ హీరోగా చూపించి.. సెకండాఫ్‌లో ఫ్యామిలీ హీరోగా చూపించిన పా.రంజిత్ ఇందులో ఫ‌స్టాఫ్ అంతా ఫ్యామిలీ‌మేన్‌లా చూపించారు. ఫ్లాష్ బ్యాక్‌లో హ్యూమాతో ర‌జినీకాంత్ ప్రేమ‌.. విఫ‌లం చెంద‌డం.. ఈశ్వ‌రీరావు, ర‌జినీ మ‌ధ్య స‌న్నివేశాలు బావున్నాయి. ముఖ్యంగా ఈశ్వ‌రీరావు న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది.
 
'పేద‌వాడు ఉండ‌టానికి చోటు కావాలి. ఇంత పెద్ద దేశంలో ఇంకా పేద‌వాడికి ఉండ‌టానికి ఇళ్లు ఎందుకు లేవు' అనే ప్ర‌శ్న‌ను పా.రంజిత్ తనదైనశైలిలో రజినీకాంత్‌తో చెప్పించిన వైనం చాలా బాగుంది. ర‌జినీకాంత్‌లాంటి మాస్ హీరోతో ఇలాంటి సినిమా చేయ‌డం గ్రేట్‌. ర‌జినీ కూడా నేను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయాల‌నికాకుండా ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా చేయాల‌ని ఆలోచించి ఇమేజ్‌కి భిన్నంగా చేసిన సినిమా ఇది. నానా ప‌టేక‌ర్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్జీవో స‌భ్యురాలుగా హ్యూమా న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. స‌ముద్ర‌ఖ‌ని పాత్ర ప‌రిధి మేర చ‌క్క‌గా ఉంది. ఇక సాంకేతికపరంగా చూస్తే ముర‌ళి.జి సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ సంతోశ్ నారాయ‌ణ్ సంగీతం, నేప‌థ్య సంగీతం ఒకే. సినిమాలో ర‌జినీ చేసే ఫ్లై ఓవ‌ర్ ఫైట్ సీన్‌.. ఇంట‌ర్వెల్ సీన్స్ చిత్రానికే హైలెట్‌గా నిలిచాయి.
 
ప్ల‌స్ పాయింట్స్‌: 
సినిమాకు ప్ర‌ధాన బ‌లం అంటే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు సూప‌ర్‌స్టార్ రజినీకాంతే. రెండేళ్లు(క‌బాలి) త‌ర్వాత రజినీకాంత్ చేసిన కాలా.. ఆయ‌నకు రాజ‌కీయంగా అండగా నిలిచేలా తెరకెక్కించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ చిత్రంలో చ‌ర్చించిన ప్ర‌ధాన‌మైన పాయింట్ భూమి సమస్య. స్వాతంత్ర్యం వ‌చ్చి ఆరున్నర దశాబ్దాలు గడిచినా దేశంలోని 60 శాతం మంది ప్ర‌జ‌లు స్వంత ఇల్లు లేకుండా ఉన్నారు. అటువంటి వారి గురించి, వారి స‌మ‌స్య‌లు గురించి చ‌ర్చించే సినిమా. ద‌ర్శ‌కుడు పా.రంజిత్ ధారావి ప్రాంతాన్ని ఓ ఉదాహ‌ర‌ణంగా తీసుకుని భూమి అంద‌రి హ‌క్కు అనే స‌మ‌స్య‌ను ర‌జినీకాంత్ ద్వారా చెప్పించాడు. త్వ‌ర‌లోనే రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయ‌నున్న ర‌జినీకాంత్‌కి ఉప‌యోగ‌ప‌డే కాన్సెప్ట్ ఇది. సినిమా బ్రిడ్జ్‌ఫై వ‌చ్చే ఫైట్‌, ఇంట‌ర్వెల్ బ్లాక్‌, కోర్ పాయింట్ అన్నీ మెప్పిస్తాయి.
 
మైన‌స్ పాయింట్స్‌: 
సినిమా నెమ్మదిగా సాగటం ఓ మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్ర‌థ‌మార్థం. ఇక సినిమాలో కోర్ పాయింట్ బాగానే ఉన్నా.. ర‌జినీకాంత్ వంటి మాస్ హీరోను.. హీరోయిజాన్ని ఇంకా ఎలివేట్ చేయాల‌నిపిస్తుంది. అంద‌రికీ కోర్ థీమ్ న‌చ్చ‌క‌పోవ‌చ్చు. ఇక తెలుగు పాట‌ల్లోని సాహిత్యం అస‌లు అర్థం కావ‌డం లేదు. రజినీ ఫ్యాన్స్‌తో పాటు... సగటు ప్రేక్షకుడిని కూడా మెప్పించే చిత్రంగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. 
కాలా కోలాహలం వీడియో చూడండి...