సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (12:54 IST)

బొగ్గు మసి బతుకుల కథతో నాని దసరా చిత్రం, రివ్యూ రిపోర్ట్‌

nani-dasara
nani-dasara
హీరో నాని నటించిన దసరా సినిమా ఈరోజే విడుదలైంది. తొలిసారిగా పాన్‌ ఇండియా సినిమాగా నాని నుంచి వస్తున్న చిత్రమిది. తెలంగాణ జిల్లాలోని ఓ పల్లెటూరి గ్రామం బొగ్గు గనుల్లో బతికే ప్రజల కథ ఇది అని ముందునుంచి చెబుతున్నారు. పూర్తి తెలంగాణ నేపథ్యంలో అక్కడే పుట్టి పెరిగిన శ్రీకాంత్‌ ఓదెల తనకు తెలిసిన సంఘటనలు కథగా రాసుకుని తెరకెక్కించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.  మరి ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ.
తెలంగాణలోని మారుమూల వీర్లపల్లి గ్రామం. సింగరేణి కాలరీస్‌లో నాని, వెన్నెల (కీర్తిసురేష్‌), సూరి (దీక్షిత్‌ శెట్టి) వుంటారు. చిన్నతనంనుంచి నాని, సూరి ప్రాణ స్నేహితులు. అలాంటి నాని వెన్నెలను సూరి ప్రేమిస్తున్నాడని తెలిసి వారిని కలపడానికి ట్రై చేస్తాడు. నాని, సూరి అండ్‌ గ్యాంగ్‌ ట్రెయిన్‌లో బొగ్గు దొంగతనం చేస్తూ ఆవారా తిరిగే బ్యాచ్‌. తాగందో బతుకు గడవని పరిస్థితిలా ఊరి ప్రజలు వుంటారు. అలాంటి టైంలో ఎన్‌.టి.ఆర్‌. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మద్యపాన నిషేధం ప్రకటిస్తాడు. ఊరి జనం పిచ్చెక్కిపోతారు. ఆడవాళ్ళు అయితే మన బతుకులు బాగుపడతాయి అనుకుంటారు. అలాంటి టైంలో ఊరి సర్పంచ్‌గా తనను గెలిపిస్తే మద్యం షాప్‌ తెరుస్తానని సముద్రఖని తండ్రి వాగ్దానం చేయడం, గెలవడం జరుగుతుంది. అనంతరం తండ్రి మరణం తర్వాత సముద్రఖని తన కొడుకుని సర్పంచ్‌ చేస్తాడు. ఆ తర్వాత ఊరిలో పెనుమార్పులు వస్తాయి. అవి ఏమిటి? సర్పంచ్‌కు నాని ఎందుకు శత్రువు అయ్యాడు? చివరికి ఏమి జరిగింది? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
దసరా పేరు కూడా కథకు తగినవిధంగానే వుంది. రావణాసురిడ్ని చంపితే ఊరంతా పండగ చేసుకుంటారనే విధంగా కథ కూడా వుంది. ఈ కథ ఎన్‌.టి.ఆర్‌. ముఖ్యమంత్రిగా వున్నప్పటినుంచి ఓ గ్రామ పరిస్థితి ఎలా వుందనే చూపించారు. అయితే తెలంగాణ ప్రాంతంలో పెద్దగా పనిచేయకుండా తినుడు, తాగుడు అనేది ఎక్కువగా వున్న గ్రామం కథ. వెన్నెలను ప్రేమించడం త్యాగం చేయడం వంటివన్నీ గతంలో ఎన్‌.టి.ఆర్‌., జగయ్య నటించిన సినిమాలు చూశాం. కేవలం బ్యాక్‌డ్రాప్‌ బొగ్గు గని కార్మికుల నేపథ్యమే కానీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలనుంచి చూస్తున్న సర్పంచ్‌ అధికారం, కన్నుపడితే పక్కలోకి తెచ్చుకోవడం అనే తరహాలోనే కథంతా నడుస్తుంది.
 
బొగ్గును రైలునుంచి దొంగతనం చేయడం హీరోయిజంగా చూపిస్తూనే పిల్లంటే ఉచ్చ పోసుకునేట్లుగా మరో సన్నివేశంలో చూపించాడు. నచ్చిన అమ్మాయితో మాట్లాడాలంటే బయస్తుడు. స్నేహితుడి కోసం త్యాగం చేసే పాత్ర. అలాంటి స్నేహితుడ్ని చంపిన వాడిని మట్టుపెట్టేందుకు హీరోగా మారిపోతాడు. ఇలా నాని పాత్రలో షేడ్స్‌ వున్నాయి. నాని గెటప్‌ పుష్ప సినిమాకు పోలిక అని తెలిసిపోతున్నా, దానికంటే ముందే దసరా సినిమా పట్టాలెక్కడంతో అలానే ఆ పాత్రను వుంచేశారు.
 
ఇక వెన్నెలగా కీర్తిసురేష్‌ ఫక్తు గ్రామీణ యువతిలా మెప్పించింది. ఊరి సర్పంచ్‌కు దాయాదిగా సాయికుమార్‌ పాత్ర కొత్తగా వుంది. రaాన్సీ కీర్తి తల్లిగా నటించింది. ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎక్కువమంది లోకల్‌ టాలెంట్‌ ఆర్టిస్టులే. ఇందులో పాడిన గాయకులు, డాన్స్‌ వేసిన కొంతమంది కూడా వాటిల్లో అనుభమున్న వారే.
 
టెక్నికల్‌గా చూస్తే, సంతోష్‌ నారాయణ్‌ సంగీతం బాగానే వుంది. ధూం దాం సాంగ్‌తోపాటు నేపథ్య సంగీతంపైనా దర్శకుడి ఆసక్తి బాగుంది.  సత్యన్‌ కెమెరాకు చాలా పనిపడిరది. బొగ్గు గనిలో ధూళిలోనూ, బురదలోనూ షాట్స్‌ బాగా తీశాడు. సూరిని చంపే సమయంలో ఊరంతా తిరుగుతూ జరిగే యాక్షన్‌ ఎపిసోడ్‌ బాగా బంధించగలిగాడు. వర్షంలోనూ షాట్స్‌ కోసం పడిన కష్టం కనిపిస్తుంది.
 
ఇలాంటి పక్కా గ్రామీణ ప్రాంతంలో నాటుమనుషులు కథ ఇది. దర్శకుడు సుకుమార్‌ శిష్యుడు గనుక ఆ ఛాయాలు వుంటాయని అనుకుంటారు. కానీ పుష్పలో సుకుమార్‌ చూపించిన ఎమోషన్‌ ఇందులో పెద్దగా కనిపించదు. కాంతారా లాంటి దేవుడి సెంటిమెంట్‌ కూడా లేదు. తెలంగాణ యాసలో సాగే పాటలు, విందులు, చిందులు మినహాయిస్తే కథలో అంతగా కొత్త దనం కనిపించలేదు. మొదటి భాగంలో వెన్నెల ప్రేమ గురించి, సర్పంచ్‌ ఎన్నికల గురించే వుంటుంది. ద్వితీయార్థంలో యాక్షన్‌ హింస ఎక్కువైంది. సాగదీసినట్లుగా వుంటాయి. ఏది ఏమైనా తెలంగాణ మట్టికథే కానీ ప్రేక్షకుడిని మరింత ఇన్‌వాల్వ్‌ చేసే అంశం పెద్దగా లేకపోవడం మైనస్‌గా వుంది. ఇప్పటి జనరేషన్ కు పాత కథలు, మట్టి  వాసనలు పెద్దగా తెలియవు. వారికి కొత్తగా అనిపించవచ్చు. మరి వారు ఎంత మేరకు ఆదరిస్తారో చూడాలి.