1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By దేవీ
Last Updated : శనివారం, 24 మే 2025 (14:56 IST)

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Oka Brindavanam poster
Oka Brindavanam poster
బాలు, షిన్నోవా, బేబి సాన్విత, శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూపాలక్ష్మి, మహేందర్, వంశి నెక్కంటి నటించిన సినిమా ఒక బృందావనం. సీర్ స్టూడియోస్ బ్యానర్ పై కిషోర్‌ తాటికొండ, వెంకట్‌ రేగట్టే, ప్రహ్లాద్‌ బొమ్మినేని, మనోజ్‌ ఇందుపూరు నిర్మాణంలో సత్య బొత్స దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ‘ఒక బృందావనం’ సినిమా మే 23న థియేటర్స్ లో రిలీజయింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
నైనికా (సాన్విత) అనాథాశ్రమంలో పెరుగుతుంది. ఆ పాపకు ప్రతి సంవత్సరం జోసెఫ్ పేరుతో క్రిస్మస్ కి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి. ఎప్పటికైనా జోసెఫ్ ని కలవాలని, తన పేరెంట్స్ ఎవరో కనుక్కోవాలని అనుకుంటుంది. అందుకు రెండుసార్లు ఎస్కేప్ కు ప్లాన్ చేస్తుంది. అక్కడ నన్స్ మాత్రం జోసెఫ్ అనేవారు లేరని చెబుతుంది. మరోవైపురాజా విక్రమ్(బాలు) కెమెరామెన్ గా ఓ ఈవెంట్ కంపెనీలో పని చేస్తూ ఉంటాడు.

తండ్రి (శివాజీ రాజా) సంపాదన పెద్దగాలేదు. తాతకు కేన్సర్, అమ్మ బంగారుకూడా తాకట్టుపెడుతుంది. కొడుక సంపాదతో కుటుంబాన్ని బాగుచేయాలనే తపన తండ్రిది. కానీ కొడుకు విదేశాల్లో తన మామయ్య దగ్గర హోటల్ లో పనిచేయాలని వీసా కోసం ట్రై చేస్తుంటాడు.  డబ్బుకోసం కష్టాలుపడుతుంటే ఓ డాక్యుమెంటరీ చేయాలని తన తల్లి కోరికమేరకు మహి(షిన్నోవా) బాలును కలుస్తుంది. ఆ తర్వాత ఏమయింది? అసలు బాలునే మహి ఎందుకు కలిసింది? బాబు విదేశాల ప్లాన్ ఏమయింది? అనాథ బాలిక బేబి సాన్వితకు వీరికి లింకేమిటి? అనేది మిగిలిన సినిమా
 
సమీక్ష:
చక్కటి పాయింట్. అనాథపిల్లలను పెంచుకునేవారు ఎంచుకుంటారు. కానీ ఈ సినిమాలో అనాథే తన తల్లిదండ్రులను ఎంచుకోవడమేనేది కాన్సెప్ట్. ఐడియా చాలా బాగుంది. దానిని కథనంతో కొత్తగా చూపించాలనే దర్శకుడు ప్రయత్నం చేశాడు. హీరో హీరోయిన్లు కొత్తవారు కావడంతో ప్రేక్షకులకు కాస్త టైం పడుతుంది. మధ్యతరగతి కుటుంబంలో బాధలు హీరో కుటుంబంలో చూపించారు. ఇప్పటి యువతులు పెండ్లి మీద ఎటువంటి అభిప్రాయాలు వున్నాయనేది మహి పాత్రలో చక్కగా ఆవిష్కరించాడు. అందుకు తండ్రితో సంభాషణలు, దగ్గరుండి మందు తాగించడంవంటి సన్నివేశాలు కొందరికి కనెక్ట్ అవుతాయి. బామ్మగా చేసిన అన్నపూర్ణమ్మ పాత్రలో వినోదం కూడా పొంచివుంటుంది.
 
మొదటిభాగం కథ ప్రకారం సాగుతుంది. సెకండాఫ్ లో అసలు జోపెష్ ఎవరు? అనేదానిపైనే దర్శకుడు ప్లాన్ చేశాడు. అందుకోసం కేరళ ట్రావెలింగ్ లో వెంకట్, మహి, నైనిక ప్రయాణం ఎలా సాగింది? అసలు నైనిక ఎవరు? అనేది చక్కటి ఫీల్ తో సాగుతుంది. ఎటువంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ఒక పాప కోసం ప్రయాణం చేయడం అనే ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది. అక్కడక్కడా కాస్త సాగదీసినా ఒక మంచి ఫీల్ ఇచ్చేలా కథని నడిపించారు. లవ్ సీన్స్ మాత్రం రెగ్యులర్ గానే అనిపిస్తాయి. చాలా సినిమాల్లో ఇలాంటి సీన్స్ చూసేసాం అనిపిస్తుంది. 
 
మహిళా సాధికారిత గురించి చిన్న సందేశం ప్లాన్ చేశాడు దర్శకుడు. ఫ్లాష్ బ్యాక్ సీన్, ప్రీ క్లైమాక్స్ లో లవ్ ఎమోషన్, మధ్యలో ఫ్యామిలీ ఎమోషన్ కూడా బాగా పండించారు. అక్కడక్కడా భారంగానూ, కొన్నిచోట్ల నవ్విస్తారు కూడా. ఇప్పుడొస్తున్న యాక్షన్, థ్రిల్లర్, లౌడ్ మ్యూజిక్ సినిమాల మధ్య సింపుల్ కథ, కథనం, సింపుల్ మ్యూజిక్ తో మనసుకు హత్తుకునేలా ఈ సినిమా ఉంటుంది. కాకపోతే స్లో నేరేషన్ కావడంతో చూడటానికి కాస్త ఓపిక ఉండాలి. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. కొన్ని సీన్స్ లో కేరళ డైలాగ్స్ వచ్చినప్పుడు తెలుగు సబ్ టైటిల్స్ వేస్తే బాగుండేది.
 
బాలు కెమెరామెన్ గా సూటయ్యాడు. లుక్ లో రాజ్ తరుణ్ ను గుర్తుచేస్తాడు. షిన్నోవాని చూస్తుంటే కేరింత సినిమాలో నటి సుకృతి గుర్తుకు రావడం ఖాయం. చైల్డ్ ఆర్టిస్ట్ సాన్విత కూడా క్యూట్ గా అలరిస్తుంది. మహేందర్, మహబూబ్ బాషా అక్కడక్కడా నవ్విస్తారు. శుభలేఖ సుధాకర్ చర్చి ఫాదర్ గా కనిపిస్తారు. వంశి నెక్కంటి హీరోయిన్ తండ్రి పాత్రలో సింపుల్ గా కనిపించి మెప్పిస్తారు. రూపాలక్ష్మి, శివాజీరాజా.. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో అలరించారు.
 
సాంకేతిక చూస్తే, సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కొంతభాగం కేరళలో షూట్ చేయడంతో అందమైన లొకేషన్స్ ని చూపించారు. మ్యూజిక్ కూడా సింపుల్ గా కథకు తగ్గట్టు బాగుంది. పాటలు కూడా మెప్పిస్తాయి. కథ పాతదే అనిపించినా కాస్త కొత్త కథాంశంతో మంచి డైలాగ్స్ తో బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. ఒక బృందావనంలాంటి ఇంటిలో అనాథ చేరుకోవాలనుకోవడమే కథాంశంగా అనిపిస్తుంది.  కటుంబంతో హాయిగా చూడతగ్గ సినిమా.
రేటింగ్ : 2.75