సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By శక్తి
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (15:37 IST)

మహేష్ బాబు "సరిలేరు నీకెవ్వరు"... కెవ్వు కేక.. దద్దరిల్లింది

నటీనటులు: మహేష్‌ బాబు - రష్మిక మందన్న - విజయశాంతి - ప్రకాష్‌ రాజ్‌ - రాజేంద్ర ప్రసాద్‌ - సంగీత - వెన్నెల కిషోర్‌ - సుబ్బరాజు - హరితేజ - బండ్ల గణేష్‌ - అజయ్‌ - రఘుబాబు తదితరులు
 
సాంకేతికత: ఛాయాగ్రహణం: రత్నవేలు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, నిర్మాతలు: అనిల్‌ సుంకర - దిల్‌ రాజు, రచన - దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
 
అగ్రహీరోల సినిమాల్లో కథలు ముఖ్యం. అదెలావున్నా ఇప్పటి ట్రెండ్‌ను బట్టి అందరినీ నవ్వించాలి. ఇదే ఫార్ములాతో ప్రస్తుతం దర్శక నిర్మాతలు హీరోలు వున్నారు. ఆ క్రమంలో ఓ సామాజిక బాధ్యత కూడా వారిపై వుంది. అది 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ప్రస్పుటంగా కన్పిస్తుంది. హీరో మిలట్రీ నేపథ్యం కనుక.. 'ఇలాంటివి చాలా వచ్చేశాయి' అని కొందరు అనుకునేట్లు వున్నా చిత్రం చూశాక.. ఖంగుతింటారనే చెప్పాలి. ఇందులో విజయశాంతి కూడా నటించడంతో ఏదో ప్రత్యేకత వుందనేది తెలిసిపోయింది. మరి అది ఏమిటి? అసలు కథ ఏమిటి? తెలుసుకోవాలంటే ముందుకు వెళ్ళాల్సిందే.
 
కథ:
కర్నూల్‌లో మెడికల్‌ కాలేజీ ప్రొఫెసర్‌ భారతి (విజయశాంతి). తప్పును తప్పనే గట్టిగా చెప్పగలిగే భావం ఆమెది. ఓ స్టూడెండ్‌ చేసిన తప్పుకు తగిన శిక్ష విధిస్తే అందుకు సపోర్ట్‌ చేసిన ఆ ఊరి మంత్రి నాగేంద్ర (ప్రకాష్‌రాజ్‌)పై కేసు పెడుతుంది. దాంతో ఆమె కుటుంబం ఛిన్నాభిన్నమవుతుంది. ఇంకోవైపు  అజయ్‌ (మహేష్‌ బాబు) ఆర్మీలో మేజర్‌. ఎవరూ లేని అనాథ అయిన అతడికి అంతా దేశమే. టెర్రరిస్టును ముట్టుడించే క్రమంలో చేసిన ఆపరేషన్‌లో సోల్జర్‌ అజయ్‌ (సత్యదేవ్‌)కు తీవ్రగాయాలవుతాయి. 
 
తన చెల్లెలు పెళ్లికి వెళ్ళలేని స్థితి. ఆ స్థితిని గమనించిన పైఅధికారి మురళీశర్మ అజయ్‌ (మహేష్‌)ను ఈ అజయ్‌ (సత్యదేవ్‌) ఇంటికి పంపించి పెళ్లి సక్రమంగా జరిగేట్లు చూడాలని ఆదేశిస్తారు. అలా ఒంగోలు వచ్చిన అజయ్‌కు ప్రొఫెసర్‌ భారతిని కలవాల్సి వస్తుంది. కానీ ఆమె ప్రాణభయంతో పారిపోతుంది. ఇంతలా భయపడాల్సిన పరిస్థితి ఆమెకు ఎందుకు కల్గింది? అనే కోణంలో అజయ్‌ పరిశోధించి అందుకు కారణమైన మంత్రికి ఏవిధంగా బుద్ధి చెప్పాడనేది తెరపై చూడాల్సిందే. 
 
విశ్లేషణ: 
సినిమాలనేవి సరదా కోసం తీసేవే. కానీ అందులో ఎంతో కొంత ఎడ్యుకేట్‌ చేసే విధంగానూ వుండాలి. గతంలో అలాంటివి వుండేవి. ఈమధ్య అలాంటివి కనుమరుగవుతున్న నేపథ్యంలో కాస్తో కూస్తో కొన్ని చిత్రాలూ వస్తుంటాయి. ఆ కోవలోనిదే 'సరిలేరు నీక్వెరు'. ఏదో సినిమా ఫార్మెట్‌ ప్రకారం దర్శకుడు మలిచినా దేశమంతా ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్యను చాలా చక్కగా ఆవిష్కరించారు. సాంకేతికంగా మార్పు జరిగిన తర్వాత సోషల్‌నెట్‌‌వర్క్‌ పెరిగాక.. ఆ మధ్య 'రోపోస్‌' అనే యాప్‌ వచ్చి ప్రజల్లో తమకు నచ్చిన ఐడియాలు అందులో పొందుపర్చేవారు. 
 
అలాగే శక్తిమాన్‌ అనే ఓ వ్యక్తికూడా చెప్పిన పాయింట్‌ ఈ చిత్రంలోని పాయింట్‌ కావడం యాదృశ్చికమే. ఇదే పాయింట్‌ను బాలీవుడ్‌ నటుడు నజీరుద్దీన్‌ షా కూడా లేవనెత్తాడు. అవినీతిమయమైపోయిన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు ఇదే సరైన మార్గమని తేటతెల్లం చేశాడు. అలాంటి ఐడియా వచ్చిన దర్శకుడు తనకు తగినవిధంగా అగ్ర హీరో చెబితేనే బాగుంటుందని తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్‌రాజు, అనిల్‌ సుంకరతోపాటు పార్టనర్‌గా వున్న మహేష్‌బాబునూ మెచ్చుకోవాల్సిందే. 
 
మహేష్‌ బాబు అభిమానులు తమ హీరోను ఎలా చూడాలని అనుకుంటారో అలా చూపిస్తూ.. పక్కా కమర్షియల్‌గా మలిచాడు దర్శకుడు. కథా కథనాల్లో మరీ ఫార్ములాటిగ్గా ఉండటం.. కొన్ని చోట్ల సాగతీత ప్రేక్షకుల్ని అసహనానికి గురి చేస్తాయి. కానీ.. మహేష్‌ అభిమానులు మాస్‌ ప్రేక్షకులకు మాత్రం 'సరిలేరు నీకెవ్వరు' వినోదాన్నందించే చిత్రమే.
 
ఇంతకుముందు మహేష్‌ బాబును దర్శకులు ముభావంగా.. సీరియస్‌గా కనిపించే పాత్రల్లోనే చూపించారు. దాన్నుంచి బయటపడాలనుకున్న క్రమంలో చేసిన పాత్ర ఇది. పూర్తి ఎనర్జిటిక్‌గా జోవియల్‌గా వుంటుంది. ఈ పాత్రకు మహేష్ పూర్తి న్యాయం చేశాడు. డాన్స్‌లు బాగా చేశాడు. రష్మిక పాత్ర చలాకీగా సాగుతుంది. తను మహేస్‌ను ఏడిపించే సన్నివేశాలు చాలా ఇంప్రెసివ్‌గా అనిపిస్తాయి. 
 
ముఖ్యంగా ట్రైన్‌ ఎపిసోడ్‌ హిలేరియస్‌గా వుంటుంది. ఇంతకుముందు 'దూకుడు', 'ఖలేజా'లో మహేష్‌ పంచిన వినోదం అంతాఇంతా కాదు. ఇప్పుడు ఆ సినిమాల్ని గుర్తుకు తెస్తూ 'సరిలేరు నీకెవ్వరు'లో అభిమానుల్ని ఉర్రూతలూగించాడు. సినిమాలో హైలైట్‌ అయింది మహేషే. హీరో ఎలివేషన్‌ సీన్లలో రెచ్చిపోవడమే కాదు.. అవసరమైనపుడు కామెడీ కూడా చేసి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్‌ చేశాడు మహేష్‌.
 
ట్రైలర్‌లో 'సంక్రాంతికి అల్లుడు వస్తాడు. కానీ నాకు మొగుడు వచ్చాడు' అని ప్రకాష్‌రాజ్‌ అన్న డైలాగ్‌ పాపులర్‌ అయింది. అది ఏమిటి అనేది సినిమాలో చూడాల్సిందే. అన్ని అంశాలున్న ఒక ప్యాకేజీలా ఈ సినిమాను మలిచారు. డైలాగులు చాలా బాగున్నాయి. 'మ్యావ్‌ మ్యావ్‌ పిల్లి.. మిల్కీ బాయ్‌తో పెళ్లి'.. వంటి ప్రాస డైలాగ్‌లు ఇందులో బాగానే వున్నాయి. మేజర్‌ అంటే సీరియస్నెస్ కాదు. జోవియల్‌గా వుంటారని తన అనుభవంతో దర్శకుడు మలిచిన పాత్ర చిత్రానికి ప్రధాన ఆకర్షణ. 
 
అందుకే ఆర్మీ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలు రొటీన్‌ అనిపించినప్పటికీ వినోదాన్ని పంచుతాయి. చిన్నపిల్లల్ని ఉగ్రవాదుల నుంచి కాపాడే రెస్క్యూ ఆపరేషన్లో మహేష్‌ ఎనర్జీకి తోడు యాక్షన్‌ కూడా ఆకట్టుకుంటుంది. సైనికులంతా కలిసి తమన్నాతో స్టెప్పులేస్తూ పార్టీ చేసుకుంటారు. అయితే అక్కడక్కడా కొంచెం శ్రుతిమించినట్లుగా హీరోయిన్‌ కుటుంబ సభ్యుల ప్రవర్తన వుంటుంది. కానీ ఇది పక్కా మాస్‌ కోసమే చేసినట్లుగా అనిపిస్తుంది. 
 
హీరో, విలన్‌ కలిస్తే ఫైట్స్‌ దద్దరిలిపోతాయి. అలా బొమ్మ బొమ్మ దద్దరిల్లిపోతుంది అంటూ ఇంటర్వెల్‌ దగ్గర హీరో ఊరించిన డైలాగ్‌తో ద్వితీయార్థం మొదలవుతుంది. అక్కడ సీరియస్‌ అంశమే అయినా దాన్ని లాజిక్కుగా హీరో మలిచిన తీరు బాగుంది. ఇక విలన్‌ అజయ్‌ పాత్ర భయపడే సన్నివేశం అతని నటుడ్ని మరోసారి గుర్తు చేసింది. విజయశాంతి నటన చాలాకాలం తర్వాత ప్రేక్షులకు రుచిచూపించింది. 
 
సినిమాల్లో విలన్‌, హీరో మధ్య ఎత్తులు పై ఎత్తులు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అనేవి కూడా వినోదాత్మకంగా మలచడంతో బోర్‌ కొట్టలేదు. ఇక సూపర్‌స్టార్‌ కృష్ణ నటించారు. పాత్ర ఎలా వుందంటే.. చూస్తే మీకే తెలుస్తుందంటూ.. హీరో, దర్శకుడు, నిర్మాత చెబుతూ వచ్చారు. చూశాక.. కరేక్టే.. సరైన సందర్భంలో వాడారుగదా అనిపిస్తుంది. ఆ సీన్‌ చూడాల్సిందే.  
 
ఇక టెక్నికల్‌గా దేవీశ్రీప్రసాద్‌ ఇచ్చిన మ్యూజిక్‌ ఎనర్జీతో సాగే మైండ్‌‌బ్లాంక్‌ పాట ద్వితీయార్ధాన్ని కొంచెం నిలబెట్టాయి. కొండారెడ్డి బురుజు సెట్‌ బాగుంది.  జయప్రకాష్‌ రెడ్డి వద్ద ఆయన స్టయిల్‌ రాయలసీమ యాసలో మాట్లాడినపుడు మహేష్‌ కామెడీ టైమింగ్‌ చూడొచ్చు. సైనికుల గొప్పదనం గురించి చెప్పే సన్నివేశంలో విజయశాంతి నట కౌశలం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఇది సైనికులు గర్వపడేట్లుగా వుంటుంది. ఇక చిన్నచిన్న లోపాలు లేకపోలేదు. సినిమాటిక్‌గా కథ రాసుకోవడం, దానికి ముగింపు ఇవ్వడం మినహా మొత్తంగా అందరూ చూడతగ్గ చిత్రమిది. గో అండ్‌ వాచ్‌ ఇట్‌.
 
రచన : శక్తి