నటీనటులు: విజయ్ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు
సాంకేతికతః సినిమాటోగ్రఫీ: ఎన్.ఎస్.ఉదయ్‌కుమార్, సంగీత దర్శకుడు: నివాస్ కె.ప్రసన్న, నిర్మాతలు: టి.డి.రాజా, డి.ఆర్. సంజయ్ కుమార్, దర్శకుడు: ఆనంద కృష్ణన్, ఎడిటర్: విజయ్ ఆంటోని.
విజయ్ ఆంటోని హీరోగా వచ్చే సినిమాలు ఒక్కోటి ఒక్కో ప్రత్యేకత వుంటుంది. బిచ్చగాడు సినిమా అతన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. ఇప్పుడూ విజయరాఘవన్ తల్లిసెంట్‌మెంట్ అయినా వర్తమాన రాజకీయాలను మిళితం చేసి మెప్పించాడు. మెట్రో వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ఆనంద కృష్ణన్ రూపొందించిన సినిమా విజయ రాఘవన్. తెలుగులో ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
విజయ్ ఆంటోని (విజయ రాఘవన్) అరకులోని ఓ గ్రామం. ఊరి సర్పంచ్ అయినా విజయ్ తల్లి పేదలకు సేవ చేయాలనకుంటుంది. ఇది గిట్టనివారు ఆమె భర్తను చంపేస్తారు. ఈమె చావుబతులమధ్య కొట్టుమిట్టాడుతూ విజయ్‌ను కంటుంది. కొడుకును ఐ.ఎ.ఎస్.గా చూడాలనే కోరిక వెల్లడిస్తుంది. ఇక అక్కడనుంచి హైదరాబాద్ వచ్చిన విజయ్ ఓ గవర్నమెంట్ కాలనీలో వుంటాడు. అక్కడ పిల్లలకు ట్యూషన్ చెబుతూ మరోపక్క ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అక్కడి రాజకీయాల్లోకి అనుకోకుండా విజయ్ తలదూర్చాల్సివస్తుంది. దానివల్ల ఐ.ఎ.ఎస్.కు అడ్డంకులు వస్తాయి. ఒకవైపు తల్లికిచ్చిన మాట మరోవైపు రాజకీయనాయకులు ఒత్తిడి. చివరికి ఆ కాలనీకి కార్పొరేట్ గా ఎన్నికవుతాడు. ఇక అక్కడనుంచి అసలు సమస్య మొదలవుతుంది. ఆ సమస్య ఏమిటి? తల్లి మాట నెర్చాడా? లేదా అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
మారుమూల గ్రామం నుంచి సిటీవరకు జరుగుతున్న రాజకీయ నాయకుల అవినీతి, ప్రభుత్వాధికారుల చేతివాటం, బెదిరింపు రాజకీయాలు వంటి అంశాలన్నీ దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చూపించాడు. దీనిపై పూర్తిగా స్టడీ చేసి తీసిట్లుంది. ముఖ్యంగా గవర్నమెంట్ కాలనీ అంటే ఎంత భ్రష్టుపట్టినట్లుగా వుంటుందో తెలిసిందే. దాన్ని హీరో శుభ్రం చేయడం, అక్కడివారిని చైతన్యవంతుల్ని చేయడం అనే అంశాలు, సన్నివేశాలు, హీరో పడే కష్టం బహుశా తెలుగులో ఏ హీరో కూడా చేయలేరనే చెప్పవచ్చు. సినిమా మొదటి భాగం సమాజ భవిష్యత్‌ను చూసినట్లుంది.
ఇక ద్వితీయభాగంలో కాస్త సినిమాటిక్‌గా కనిపించినా రాష్ట్రంను, దేశాన్ని మార్చే దిశగా ఎలా అడుగులు హీరో వేశాడో చూపాడు. మున్సిపల్ చైర్ పర్సన్, కార్పొరేటర్ల సమావేశం కూడా పూస గుచ్చినట్లు చూపించాడు. ముఖ్యంగా స్లమ్ నేపథ్యం దగ్గరనుంచీ అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడంతో పాటు రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను చూపించిన విధానం, ఇలా ప్రతిది ఆనంద కృష్ణన్ చాల చక్కాగా ఎస్టాబ్లిష్ చేశాడు. అదే విధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు (మదర్ సెంటిమెంట్ సీన్స్) ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయి. ఇక విజయ రాఘవన్ పాత్రలో కనిపించిన విజయ్ ఆంటోని తన హావభావాలతో చక్కగా నటించాడు. అలాగే ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించిన ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలో చెప్పిన మెసేజ్ కూడా బాగుంది.
సెకండాఫ్‌లో కథాపరంగా హీరోను హైలైట్ చేసే క్రమంలో అధికార పార్టీ నాయకుల్ని సైతం లెక్కచేయకుండా రాజకీయ తెలివితేటలతో ఎలా చేయవచ్చో అనేది సినిమాటిక్‌గా వుంది. దాంతో మధ్య మధ్యలో అనవసరమైన ల్యాగ్ సీన్స్ తో నిరాశ పరిచాడు.
ఇక భాషశ్రీ సంభాషణలు చిత్ర కథనానికి, హీరోయిజానికి వన్నెతెచ్చాయి. నివాస్ కె.ప్రసన్న అందించిన పాటలు బాగున్నాయి.ఎన్.ఎస్. ఉదయ్‌కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు ఆనంద కృష్ణన్ స్క్రిప్ట్ లో ల్యాగ్ లేకుండా చూసుకుని ఉండి ఉంటే ఇంకా బాగుండేది.
అయితే ముగింపు మాత్రం చాలా సినిమాటిక్‌గా వుంది. ఈ కథకు సీక్వెల్‌గా తీయవచ్చనే ఇండికేషన్ కూడా వేస్తూ, 2024లో కలుద్దాం అని ముగించాడు. తన తల్లి జీవితంలో జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని, ఆ బాధనే ఒక ఆశయంగా మార్చుకుని ఎదిగిన విజయ్ రాఘవన్కొన్ని చోట్ల పేలవమైన కథనం వంటి అంశాలు సినిమాకి బలహీనతలు గా నిలుస్తాయి. ఏది ఏమైనా ఇటువంటి చిత్రాన్ని ఇప్పటి తరం చూడతగ్గ చిత్రంగా పేర్కొనవచ్చు.
రేటింగ్ః 3/5