సినిమా గ్రామర్ పాటించని సినిమా తంగలాన్ - అపరిచితుడు, నాన్న, ఐ లాంటి మూవీ : చియాన్ విక్రమ్
చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "తంగలాన్". ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.
"తంగలాన్" సినిమాను జనవరి 26న రిలీజ్ చేయనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బుధవారం హైదరాబాద్ ఏఎంబీ మల్టీప్లెక్స్ లో "తంగలాన్" సినిమా టీజర్ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్, దర్శక నిర్మాత పా.రంజిత్, నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, హీరో సత్యదేవ్, డైరెక్టర్స్ బాబి, సురేందర్ రెడ్డి, కరుణ కుమార్, వేణు ఊడుగుల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో చియాన్ విక్రమ్ మాట్లాడుతూ - మా సినిమా తంగలాన్ టీజర్ రిలీజ్ ఈవెంట్ కు ఇక్కడికి వచ్చిన వారందరికీ థ్యాంక్స్. ప్రతిసారీ నా సినిమాల ఈవెంట్ కు పెద్ద వాళ్లు గెస్టులుగా వస్తుంటారు. ఈ సారి యంగ్ డైరెక్టర్స్, హీరోస్ వచ్చారు. వాళ్లు నా గురించి మాట్లాడుతుంటే హ్యాపీగా ఉంది. ఇప్పటిదాకా పోస్టర్, ఫస్ట్ లుక్స్ చూశారు. తంగలాన్ మూవీకి ఒక ఈవెంట్ లో మీతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవడం ఇదే తొలిసారి. టీజర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. తొమ్మిది నెలలు సినిమాను క్రాంతికుమార్ గారి డైరెక్షన్ లో నటించాను. ఆ సినిమాకు సురేందర్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండేవాడు. అప్పటి నుంచి మా రిలేషన్ కొనసాగుతోంది. అతను హీరో కావాలని నేను కోరుకున్నా కానీ డైరెక్టర్ అయ్యాడు. తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. నేను నటించిన శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి మూవీస్ లాగే తంగలాన్ ఒక డిఫరెంట్ మూవీ. మీకు టీజర్ తో తెలిసి ఉంటుంది. ఇదొక ఎమోషనల్ మూవీ, రా కంటెంట్ తో ఉంటుంది. ఈ స్క్రిప్ట్ చేసిన తర్వాత రంజిత్ ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయాడు. సినిమా గ్రామర్ పాటించని సినిమా ఇది. పాటలు, ఫైట్స్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఇలా పా.రంజిత్ డిజైన్ చేయలేదు. తంగలాన్ లో ఒక లైఫ్ ఉంటుంది. తంగలాన్ ఒక డిఫరెంట్ మూవీ. కొన్నిసార్లు ఒక సీన్ ఒకే షాట్ లో చేశాము. లైవ్ సౌండింగ్ లో చేసేవాళ్లం. ఈ సినిమా నాకొక బ్యూటిఫుల్ ఎక్సీపిరియన్స్. ఎందుకంటే ఇప్పటిదాకా నేను లైవ్ సౌండింగ్ లో సినిమా చేయలేదు. నా ప్రతి సినిమాలో కొంత గొంతు మార్చి మాట్లాడుతుంటా. ఈ సినిమాలోనూ అలాగే డైలాగ్స్ చెప్పాను. రోజంతా రెస్ట్ లేకుండా పనిచేసేవాళ్లం. ఆ ప్రాంతం వాళ్లు ఎలాంటి లైఫ్ లీడ్ చేశారో..మేమూ అలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తూ షూటింగ్ చేశాం.
నేను ఇప్పటిదాకా ఇలాంటి మూవీ చేయలేదు. ఇంత కష్టపడి చేయలేదు. దానికి కారణం..మా డైరెక్టర్ పా.రంజిత్. ఆయన నా దగ్గరకు ఒక కమర్షియల్ కథ తీసుకురాలేదు. పా.రంజిత్ కెరీర్ లో కమర్షియల్ మూవీస్ తో పాటు ఆర్టిస్టిక్ మూవీస్ చేస్తూ బ్యాలెన్స్ గా కెరీర్ సాగిస్తున్నారు. తన సినిమాలతోనే దర్శకుడిగా ఆయన ఐడియాలజీ, స్పెషాలిటీ చూపించారు. పా.రంజిత్ చేసిన గొప్ప సినిమాల్లో తంగలాన్ ఒకటి అవుతుంది. ప్రేక్షకుల్ని తంగలాన్ తన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. జ్ఞానవేల్ నాకు ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇది మా కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ ..ఇకపైనా మేము సినిమాలు చేస్తాం. గతంలో బాలీవుడ్ సినిమా గురించే దేశమంతా మాట్లాడుకునేది. ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ వంటి సౌత్ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. కేజీఎఫ్, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు దీన్ని ప్రూవ్ చేశాయి. ఆర్ఆర్ఆర్ తో మనం కూడా ఆస్కార్ గెల్చుకోవచ్చు అని నిరూపించారు దర్శకుడు రాజమౌళి గారు. ఈ వేదిక నుంచి ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. తంగలాన్ లో రెండు క్యారెక్టర్స్ చేశాను. ఆ క్యారెక్టర్స్ లో సహజంగా కనిపించేందుకు శారీరకంగా చాలా శ్రద్ధ తీసుకున్నాను. ఆహారం దొరకని పరిస్థితిలో ఉన్న క్యారెక్టర్ లో కనిపించాలంటే నేను హీరో బాడీతో ఉంటే ఎవరికీ నచ్చదు. తెలుగు సినిమాలకు తమిళనాట ఆదరణ లేదు అనడం సరికాదు. అక్కడ తమిళ స్ట్రైట్ సినిమాల కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన పరభాషా చిత్రాలున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతారను తమిళ ఆడియెన్స్ బాగా ఆదరించారు. అన్నారు.