మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (18:02 IST)

ఆరుగురు సుప్రీం జడ్జిలకు స్వైన్ ఫ్లూ, ఈ వ్యాధి ఎలా వస్తుంది? లక్షణాలు ఏంటి?

చలికాలం వస్తే స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్వైన్ ఫ్లూ వ్యాధితో ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బాధపడుతున్నారని, ఈ అనారోగ్య సమస్య ప్రబలకుండా చర్యలను తీసుకునేందుకుగాను ప్రధాన న్యాయమూర్తితో సమావేశం జరిగిందని సీనియర్ న్యాయమూర్తి ఈ రోజు కోర్టులో తెలిపారు. న్యాయమూర్తులు అనారోగ్యానికి గురికావడం వల్ల సబ్రిమాల వర్సెస్ రైట్స్ కేసుపై తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్‌తో సహా రెండు రాజ్యాంగ బెంచ్ కేసుల్లో విచారణలు నిలిచిపోయాయి.
 
ఆరుగురు న్యాయమూర్తులు హెచ్ 1 ఎన్ 1 వైరస్‌తో బాధపడుతున్నారని జస్టిస్ డివై చంద్రచూడ్ కోర్టులో తెలిపారు. న్యాయమూర్తులందరూ చీఫ్ జస్టిస్ ఎస్‌ఐ బొబ్డేతో సమావేశమై పరిస్థితిపై చర్చించారు. సుప్రీంకోర్టులో పనిచేసేవారిని టీకాలు వేయమని ఆదేశించాలని చీఫ్ జస్టిస్ బొబ్డేను కోరినట్లు జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.
 
ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దేవ్‌తో సమావేశమయ్యారు. స్వైన్ ఫ్లూ టీకాలు వేయడం కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక డిస్పెన్సరీని ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఇటీవల సుప్రీంకోర్టు కాంప్లెక్స్‌లో జ్యుడిషియల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కొంతమంది విదేశీ ప్రతినిధి బృందం వైరస్ బారిన పడినట్లు మిస్టర్ డేవ్ చెప్పారు.
 
స్వైన్ ఫ్లూ ఎలా వస్తుంది? లక్షణాలు ఏంటి?
ఆయాస పడటం లేదా శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కోవటం, జ్వరం అనేవి సాధారణ స్వైన్ ఫ్లూ లక్షణాలు. వీటితోపాటు కొంతమందికి ఒళ్లు నొప్పులు, ముక్కు కారటం, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాలు.. లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
ముఖ్యంగా వేగంగా శ్వాస తీసుకోవటం, నీరు తాగటంలో లేదా ఆహారం మింగటంలో ఇబ్బంది ఏర్పడటం, జ్వరం, తీవ్రంగా దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే స్వైన్ ఫ్లూగా భావించి అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించి, తగిన వైద్యాన్ని అందించాల్సి ఉంటుంది.
 
ఫ్లూ సీజన్‌లో జ్వరం రావటం, మందులు వాడినా, వాడకపోయినా ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోవటం సహజమే. చిన్నపిల్లల విషయంలో... జ్వరం తగ్గిపోయిన వెంటనే పిల్లలను పాఠశాలలకు పంపకుండా ఒక రోజంతా ఇంట్లోనే పూర్తిగా విశ్రాంతి తీసుకునేలా చేయాలి.
 
చిన్నారులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పడు తప్పకుండా టిష్యూ పేపర్లను అడ్డు పెట్టుకోవాలని తల్లిదండ్రులు తెలియజెప్పాలి. అలాగే ఒకసారి వినియోగించిన టిష్యూ పేపర్లను ఇంట్లో ఎక్కడంటే అక్కడ పడవేయకుండా.. వెంటనే వాటిని చెత్తబుట్టలో పారవేయమని చెప్పాలి. అంతేగాకుండా, పిల్లలు తుమ్మిన ప్రతిసారీ వారి చేతులను శుభ్రం చేయడం మంచిది.
 
ఇక చివరిగా.. చిన్నారులకు ముందుగానే సీజనల్ ఫ్లూ నివారణా వ్యాక్సిన్లను వేయించటం ఉత్తమం. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కూడా. అలాగే స్వైన్ ఫ్లూ నివారణా వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
 
ఈ వ్యాక్సిన్ పిల్లలకు ఎలా వాడాలంటే.. మొత్తంమీద రెండు డోసుల వ్యాక్సిన్ అవసరమవుతుంది. మొదటి డోసు తర్వాత మూడు వారాల వ్యవధితో మరో డోసు ఇప్పించాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఇచ్చాక స్వైన్ ఫ్లూ కారక హెచ్1ఎన్1 వైరస్ దాడిని ఎదుర్కొనేందుకు శరీరం పూర్తిగా సన్నద్ధం కావాలంటే మరో రెండు వారాల సమయం పడుతుంది. కాబట్టి.. పైన పేర్కొన్న అంశాలను గుర్తుపెట్టుకుని తగువిధంగా చర్యలు తీసుకోవాలి.