సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జులై 2022 (13:47 IST)

అన్నాడీఎంకే నుంచి ఓ.పన్నీర్ సెల్వం బహిష్కరణ

opanneerselvam
అన్నాడీఎంకే పార్టీ నుంచి ఆ పార్టీ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు సోమవారం జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో అన్నాడీఎంకేలో గత రెండు వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. 
 
తాజా నిర్ణయంతో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి నియమితులయ్యారు. కాగా.. పార్టీని తన నియంత్రణలోకి తీసుకొన్న కొద్దిసేపటికే ప్రత్యర్థి నేత ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌)పై ఈపీఎస్‌ చర్యలు తీసుకొన్నారు. 
 
ఆయనను కోశాధికారి పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఆయనతో పాటు ఓపీఎస్‌ మద్దతుదారులను కూడా పార్టీ నుంచి తొలగించడం గమనార్హం.
 
అన్నాడీఎంకేలో ఏక నాయకత్వ వ్యవహారంపై పళని, పన్నీర్‌ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పళని నేతృత్వంలో సర్వసభ్య సమావేశంపై నిషేధం విధించాలని పన్నీర్‌ సెల్వం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. 
 
అయితే, ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు కోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వచ్చిన కాసేపటికే.. పళని నేతృత్వంలో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఇందులో ఈపీఎస్‌ వర్గం తీసుకొచ్చిన 16 తీర్మానాలకు ఆమోదముద్ర వేశారు. పళనిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించే తీర్మానాన్ని కూడా ఆమోదించారు.
 
ఈ సందర్భంగా.. ఓపీఎస్‌, అతడి మద్దతుదారులను పార్టీ నుంచి తొలగించేందుకు తీసుకొచ్చిన ప్రత్యేక తీర్మానానికి కూడా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు అన్నాడీఎంకే వెల్లడించింది. పన్నీర్‌ సెల్వం.. అధికారిక డీఎంకేకు మద్దతిస్తున్నారని, అధికార పార్టీ నేతలతో సంబంధాలు పెంచుకొని, అన్నాడీఎంకేను బలహీన పర్చేందుకు ప్రయత్నిస్తున్నారని తీర్మానంలో ఆరోపించారు. 
 
పార్టీ సిద్ధాంతాలు, ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు గానూ.. ఆయనను కోశాధికారి పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా బహిష్కరించాలని తీర్మానం ప్రవేశపెట్టగా.. అందుకు సర్వసభ్య మండలి అంగీకరించింది. ఆయనతో పాటు ముగ్గురు మద్దతుదారులను తొలగించింది.
 
అయితే, తనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానంపై ఓపీఎస్ స్పందించారు. తాను 1.5కోట్ల మంది పార్టీ కార్యకర్తల చేత అన్నాడీఎంకే కో ఆర్డినేటర్‌గా ఎన్నికయ్యాయని తెలిపారు. తనను పార్టీ నుంచి బహిష్కరించే హక్కు పళనిస్వామికి లేదన్నారు. 
 
పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకొన్నందుకు గానూ.. ఈపీఎస్‌నే తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై తాను కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు.