శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 28 మార్చి 2018 (17:12 IST)

కావేరి బోర్డు ఏర్పాటు చేయకుంటే ఆత్మహత్యే.. లోక్‌సభ వాయిదా

కావేరీ జలాల పంపిణీ కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావేరీ బోర్డును ఏర్పాటు చేయకుంటే అన్నాడీఎంకేకు చెందిన సభ్యులంతా ఆత్మహత్యలకు పాల్పడుతామని ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు నవనీతకృష్ణన్ హెచ్చరించారు.

కావేరీ జలాల పంపిణీ కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావేరీ బోర్డును ఏర్పాటు చేయకుంటే అన్నాడీఎంకేకు చెందిన సభ్యులంతా ఆత్మహత్యలకు పాల్పడుతామని ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు నవనీతకృష్ణన్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన బుధవారం రాజ్యసభలో ఉద్వేగభరితంగా మాట్లాడారు. 
 
కావేరీ బోర్డును ఈనెల 29వ తేదీలోపు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించింది. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ దిశగా ఒక్క చర్యకూడా చేపట్టిన దాఖలాలేవు. మరోవైపు, కావేరి బోర్డును ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే సభ్యులు పార్లమెంట్ ఉభయసభల్లో రచ్చ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. 
 
ఈనేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం రాజ్యసభలో నవనీతకృష్ణన్ స్పందిస్తూ కావేరి బోర్డును ఏర్పాటు చేయకుంటే తమ పార్టీకి చెందిన సభ్యులంతా (ఎంపీలు) ఆత్మహత్య చేసుకుంటామని ప్రకటించారు. కేంద్రం వైఖరికి నిరసనగా ఎంపీలంతా రాజీనామాలు చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తూ ఒత్తిడి చేస్తున్నారనీ అందువల్ల తక్షణం బోర్డును ఏర్పాటు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. 
 
మరోవైపు, లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. బుధవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై బుధవారమైనా చర్చ జరుగుతుందని అందరూ భావించినప్పటికీ అన్నాడీఎంకే సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది. 
 
బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే సభ్యులు "వీ వాంట్ కావేరీ" అంటూ సభలో నినాదాలు చేశారు. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో అన్నాడీఎంకే సభ్యుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు స్పీకర్ వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు.
 
అవిశ్వాస తీర్మానంపై నోటీసులు అందాయని సభ సజావుగా లేనందున చర్చను జరపలేకపోతున్నానని స్పీకర్ సుమిత్రామహాజన్ చెప్పారు. అవిశ్వాసంపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు పట్టుబట్టగా, చర్చకు సిద్ధంగా ఉన్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి అనంత్‌కుమార్ సభకు తెలిపారు. అయితే, సభలో నెంబర్ల ప్లకార్డులతో కాంగ్రెస్ సభ్యులు రావడం సభా మర్యాదలకు విరుద్ధమని గుర్తు చేశారు. 
 
దీనిపై కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మల్లికార్జునఖర్గే మాట్లాడుతూ ఎట్టిపరిస్థితుల్లోనూ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలని, కావాల్సినంత సంఖ్యాబలం ఉందని, ప్లకార్డులతో వచ్చామని, నెంబర్ కూడా ఉందని ఆయన చెప్పారు. అయితే సభ ఆర్డర్‌లో లేని కారణంగా చర్చ చేపట్టలేకపోతున్నానంటూ స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేయడం గమనార్హం.