సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (11:01 IST)

బోటు ప్రమాదం : సుడిగుండం - ఉక్కపోతే కొంపముంచాయా?

గోదావరి నదిలో దేవీపట్నం వద్ద ఆదివారం జరిగిన బోటు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా, గత కొన్ని రోజులుగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. దీంతో నీటి వేగం అధికంగా ఉంది. పైపెచ్చు.. పలు ప్రాంతాల్లో సుడిగుండాలు ఉన్నాయి. మరోవైపు, బోటులో ప్రయాణించేవారు.. ఉక్కపోత కారణంగా లైఫ్ జాకెట్లను ధరించలేదు. సుడిగుండంలో చిక్కుకుని బోటు మునిగిపోవడం ఒక కారణం కాగా, ఉక్కపోత కారణంగా లైఫ్ జాకెట్లు ధరించలేదు.
 
ఫలితంగా బోటు మునిగిన తర్వాత చాలామంది తలో దిక్కుకు కొట్టుకుపోయారని అన్నారు. కొందరైతే కాఫర్ డ్యామ్ వరకు వెళ్లిపోయారని తెలిపారు. ఉక్కపోత లేకపోతే వారంతా లైఫ్ జాకెట్లు తీసేవారు కాదని, ఫలితంగా వారంతా ప్రాణాలతో బయటపడేవారని పేర్కొన్నారు. లైఫ్ జాకెట్లు ధరించిన వారిలో 14 మంది బతికి బయటపడ్డారని ప్రభాకర్ తెలిపారు.
 
ఇదిలావుంటే, పాపికొండలు ప్రాంతంలో గోదావరి చుట్టూ కొండలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ కిలోమీటరు లోపే వెడల్పు ఉంటుంది. పోలవరం వచ్చే సరికి ఈ వెడల్పు 4 కిలోమీటర్లు వ్యాపించి ఉంటుంది. పేరంటాలపల్లి నుంచి పోలవరం వరకు ఎన్నో మలుపులు ఉంటాయి. వెడల్పు తక్కువగా ఉండడం.. మలుపులు ఎక్కువగా ఉండడం వల్ల నీటి ప్రవాహం వేగం పెరిగి గట్టును ఢీకొని సుడిగుండాలుగా మారతాయి. 
 
అందుకే పాపికొండలు వెళ్లే ప్రయాణికుల బోట్లను ఇక్కడ జాగ్రత్తగా నడుపుతారు. ప్రవాహ వేగాన్ని బట్టి వేగంగా నడపడం.. లేదంటే నిలిపివేయడం చేస్తుంటారు. డ్రైవరు అప్రమత్తంగా లేకపోతే బోట్లు సుడిగుండంలో చిక్కుకుని గల్లంతవుతాయి. ఆదివారంనాటి ప్రమాదం కూడా ఇలానే జరిగిందని అధికారులు అంటున్నారు.