గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : గురువారం, 24 మే 2018 (16:31 IST)

ట్రెండ్ అవుతున్న ఫిట్‌నెస్ ఛాలెంజ్.. ఐస్ బకెట్ ఛాలెంజ్‌‌లా వైరల్.. కోహ్లీ ఛాలెంజ్‌ను మోదీ?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ ఛాలెంజ్ విసిరాడు. కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ చేసిన ఓ ఫిట్‌నెస్ చాలెంజ్‌ని స్వీకరించి, దాన్ని పూర్తి చేసిన విరాట్ కోహ్లీ, తను

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ ఛాలెంజ్ విసిరాడు. కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ చేసిన ఓ ఫిట్‌నెస్ చాలెంజ్‌ని స్వీకరించి, దాన్ని పూర్తి చేసిన విరాట్ కోహ్లీ, తను చేసిన ఛాలెంజ్‌ని స్వీకరించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ, ఎంఎస్ ధోనీ, తన భార్య అనుష్క శర్మలకు సవాల్ విసిరాడు.
 
రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, మంగళవారం నాడు తాను పుషప్స్ తీస్తున్న వీడియోను ట్వీట్ చేస్తూ, ''ఫిట్ నెస్ మంత్ర'' అని ట్యాగ్ లైన్ తగిలించి హృతిక్ రోషన్, విరాట్ కోహ్లీ, సైనా నెహ్వాల్‌లకు సవాల్ విసిరాడు. ఇక ఎల్లప్పుడూ ఫిట్ నెస్ కోసం తాపత్రయపడే కోహ్లీ, ఈ వీడియోను చూసి, ఆ వీడియోలోని ఛాలెంజ్‌ను స్వీకరించాడు. స్పైడర్ ప్లాంక్ చేసి చూపెట్టాడు. వీడియోను ట్వీట్ చేస్తూ, ఇదే చాలెంజ్‌ని తాను తన భార్య, మన ప్రధాని, సోదరుడు ధోనీకి విసురుతున్నానని కోహ్లీ అన్నాడు. ప్రస్తుతం కోహ్లీ ట్వీట్ వైరల్ అవుతోంది. 
 
అయితే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని తాను స్వీకరిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. త్వరలోనే తన ఫిట్‌నెస్ వీడియోను షేర్ చేసుకుంటానని క్లారిటీ ఇచ్చారు. అలాగే కోహ్లీ ఛాలెంజ్‌ను ఆయన సతీమణి, సినీనటి అనుష్క శర్మ కూడా స్వీకరించి.. ఛాలెంజ్‌‌లో తానేంటో నిరూపించుకుంది. ప్రస్తుతం ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ ఐస్ బకెట్ ఛాలెంజ్‌లా విస్తరిస్తోంది. నెటిజన్లు ఈ ఛాలెంజ్‌ కోసం వీడియోలను వెతుక్కుంటూ కూర్చున్నారు. 
 
ఇక సెలెబ్రిటీలు ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ.. వాటిని నిరూపిస్తూ.. ఇతరులకు ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సురేష్ రైనా తన ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కేంద్రమంత్రి జేపీనడ్డా, హర్భజన్ సింగ్, సోనమ్ కపూర్‌లకు సురేష్ రైనా ఛాలెంజ్ చేశాడు.
 
ఇకపోతే.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ ఫిట్‌నెస్‌ సవాల్ వీడియోలు ట్రెండ్ అవుతున్న వేళ.. కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ సవాలు విసిరిన వారిలో హైదరాబాదీ, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా ఉన్నారు. ఆమె వ్యాయామం చేసి పీవీ సింధూతో పాటు మరో ఇద్దరికి సవాలు విసిరింది.
 
పీవీ సింధు కూడా ఈ సవాలు స్వీకరించి అక్కినేని అఖిల్‌‌తో పాటు మరో ఇద్దరికి చాలెంజ్‌ చేయగా.. అఖిల్‌జిమ్‌లో వ్యాయామం చేసి పలువురికి సవాలు విసిరాడు. వారిలో అక్కినేని నాగచైతన్య కూడా ఉన్నారు. నాగచైతన్య గురువారం జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తూ పుషప్స్‌తో పాటు పలు రకాల వ్యాయామాలు చేస్తూ 52 సెకన్ల వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా తన శ్రీమతి సమంతతో పాటు సినీనటులు సుశాంత్‌, నిధి అగర్వాల్‌కి ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ విసిరాడు.
 
ఇంకేముంది..? శ్రీవారి చాలెంజ్‌ను సమంత స్వీకరించి, ఎవరెవరికి సవాలు విసురుతుందో వేచి చూడాలి. మొత్తానికి ఈ చాలెంజ్‌ పిట్‌నెస్‌ దేశ ప్రజలకు అవగాహన కల్పించేలా ఉంది. ప్రతిరోజు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సెలెబ్రిటీలు ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ ద్వారా పిలుపునిస్తున్నారు.