మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Modified: బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (15:40 IST)

sharmila: కేసీఆర్-జగన్ వదిలిన బాణం కాదు, అమిత్ షా వదిలిన బాణం: జగ్గారెడ్డి

వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఆమె కేసీఆర్-జగన్ వదిలిన బాణం కాదు, అమిత్ షా వదిలిన బాణం అని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీ వెళ్తున్నారు.
 
అన్ని రాష్ట్రాలలో రైతులకు మధ్దతుగా ఉద్యమాలు చేయాలని ఏఐసీసీ పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగానే సీఎల్పీ తరుపున రైతులతో ముఖాముఖి పేరుతో భట్టి విక్రమార్క ఉద్యమం చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తున్నారు. 
 
నేను ఈ నెల 15 నుంచి నా పాదయాత్ర సదాశివ పేట, ఆరూర్ గ్రామం నుంచి ప్రారంభమై, అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం దగ్గర ముగుస్తుంది. పాదయాత్ర పర్మిషన్ కూడా పోలీసులను అడగడం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం ఏర్పడింది. కేసీఆర్ అనేక సందర్భాలలో ఈ అంశాన్ని మాట్లాడారు. 
 
మరి 6 సంవత్సరాలలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? టిఎస్ పీఎస్ ఏమయ్యింది? ఘంటా చక్రపాణి పెద్దపెద్ద మాటలు మాట్లాడారు. మరి ఇచ్చిన ఉద్యోగాలెన్నో లెక్క చెప్పగలరా? కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినా... కొత్త ఉద్యోగాలు లేవు. బిస్వాల్ కమిటీ 1 లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాలీగా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చినా, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. 
 
ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే.. ఉద్యోగాలు గుర్తుకు వస్తాయా.. ఎన్నికలు రాగానే కొద్దిరోజుల్లో ఉధ్యోగ నోటిఫికేషన్లు అంటూ సీఎం కార్యాలయం నుంచి ప్రకటన. ఇది ప్రకటనలకే పరిమితం అవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ పావులు కదుపుతుంది.
 
బీజేపీ డైరెక్షన్లోనే షర్మిల పార్టీ..
జగన్ ఇప్పటికే బీజేపీతో కలసి పనిచేస్తున్నాడు. చంద్రబాబు గోడమీద పిల్లిలా కాంగ్రెస్, బీజేపీ ఎటు తేల్చుకోలేక ప్రస్తుతం మధ్యలో ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ బీజేపీ డైరెక్షన్లో నడుస్తున్నారు. వైసీపీ, టిఆర్ఎస్, బీజేపీ మూడు కలసి కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దనే కుట్ర పన్నుతున్నాయి. 
 
అందుకే షర్మిల పార్టీ వెనుక బీజేపీ హస్తం ఉందని నాకు అనుమానం ఉంది. బీజేపీ నార్త్ సైడ్ ప్రభావం కోల్పోతుంది. దీంతో దక్షిణ భారతదేశంపై ఫోకస్ చేసారు. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బలమైన కంచుకోట. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఇబ్బంది లేదు కాబట్టి.. తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని చూస్తుంది. సెటిలర్స్‌ను షర్మిల వైపు తిప్పుకొనేందుకు కొత్త పార్టీ.
 
మర్రి చెట్టుకు ఉన్న ఊడలలో ఒకటే.. షర్మిల కొత్త పార్టీ. రక్తం పంచుకున్న కూతురుతో వైఎస్ సీఎం కాలేదు. కానీ రక్తం పంచుకొని కాంగ్రెస్ అభిమానులతో వైఎస్ సీఎం అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో మాలాంటి వారు ఎందరో వైఎస్‌కు వారసులు. రెడ్డిలను కాంగ్రెస్ పార్టీ నుంచి విడదీయడానికే షర్మిలను రంగంలోకి బీజేపీ దించింది. ఇందిరా, రాజీవ్ గాంధీల పేరు లేకుండా వైఎస్ లేరు.
 
రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి. ఇదే నా చివరి కోరిక అని వైఎస్ ఎన్నోసార్లు అన్నారు. వైఎస్ కూతురుగా షర్మిలకు ఆ బాధ్యత లేదా. కాంగ్రెస్ పార్టీలో చేరి.. రాహుల్ గాంధీ ప్రధాని చేయడం కోసం పనిచేయొచ్చు కదా. సెటిలర్స్ ఉన్న ప్రాంతంలో షర్మిల మీటింగ్‌లు పెడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరు దెబ్బతీయలేరు.
 
ఇప్పుడు షర్మిల వచ్చింది. రేపు జూనియర్ ఎన్టీఆర్ లేదంటే ఎన్టీఆర్ కుటుంబం నుంచి మరో వ్యక్తి పార్టీ పెట్టొచ్చు. ఇంతటి దానికి తెలంగాణ తెచ్చుకోవడం ఎందుకు.. టిఆర్ఎస్, వైసీపీ, ఎంఐఎం, బీజేపీ, షర్మిల పార్టీలకి ఫైనాన్సర్ మెగా కృష్ణారెడ్డి... షర్మిల పార్టీపై ఎందుకు కేసీఆర్ నోరు మెదపరు.. చంద్రబాబును వెళ్ళగొట్టడానికి కుట్రలు పన్నిన కేసీఆర్... షర్మిలను పల్లెత్తు మాట కూడా అనట్లేదే... 
 
హైదరాబాద్ పొలిటికల్ టూరిస్ట్ ప్లేస్‌లా ఉంది. తెలంగాణ ప్రజలు ఈ రాజకీయ క్రీడను అర్థం చేసుకోవాలి. కేసీఆర్, జగన్, అసదుద్దీన్, షర్మిల అన్నీ అమిత్ షా బాణాలే అన్నారు జగ్గారెడ్డి.