శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (14:31 IST)

స్టేటస్‌కు తగినట్టుగా మాస్క్ : ధర జస్ట్ రూ.11.2 కోట్లు

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇపుడు ప్రతి ఒక్కరూ ముఖానికి తప్పనిసరిగా ధరిస్తున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముఖానికి మాస్క్ ధరించేలా నిర్బంధ ఆదేశాలు జారీచేశాయి. దీంతో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరిస్తున్నారు. అయితే, ఒక్కొక్కరూ ఒక్కో రకమైన మాస్కులు ధరిస్తున్నారు. ముఖ్యంగా, డబ్బున్నవారు తమ స్థాయికి తగినట్టుగా ఖరీదైన మాస్కులు ధరిస్తుంటే.. పేదలు, మధ్యతరగతి వారు మాత్రం సాధారణ మాస్కులు ధరిస్తూ ఈ కరోనా మహమ్మారిబారినపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో అమెరికాలో నివసిస్తోన్న ఓ చైనా వ్యాపారవేత్త ప్రపంచంలోనే అతి ఖరీదైన మాస్కును ధరించాలని యోచిస్తూ, దాన్ని ఆర్డర్ చేశారు. టాప్ రేటెడ్ ఎన్ 99 ఫిల్టర్లు, పసిడి, వజ్రాలు పొదిగిన మాస్క్‌ను తయారు చేయాలని కోరారు. సుమారు 11.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ ఆ చైనా వ్యాపారి ఈ మాస్కును తయారు చేయించుకుంటున్నారు. 
 
జెరూసలేంలో ఓ ఆభరణాల సంస్థలో పనిచేస్తోన్న డిజైనర్ ఐజాక్ లెవీ ఈ విషయాన్ని వెల్లడించారు. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో దీన్ని తయారు చేస్తున్నామని తెలిపారు. మాస్కు చుట్టూ 3,600 తెలుపు, నలుపు వజ్రాలతో అలంకరించనున్నామని వివరించారు. ఈ ఏడాది చివరి నాటికి దీని తయారీని పూర్తి చేస్తామని తెలిపారు.