మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 మే 2021 (18:26 IST)

నదిలో కరోనా మృతదేహం.. రాప్తీ నదిలో పడేసిన వైనం..

కరోనా వైరస్ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఈ వైరస్ బారినపడి అనేక కరోనా బాధితులు మృత్యువాతపడుతున్నారు. ఇలా చనిపోయే వారి అంత్యక్రియలను నిర్వహించేందుకు సైతం సొంత కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్‌ రోగి మృతదేహాన్ని బంధువులు రాప్తీ నదిలో పడేశారు. ఈ ఘటన మే 28న బల్రాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీన్ని ఆ వైపు నుంచి కారులో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు వీడియో తీశారు. వీడియోలోని ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు పీపీఈ కిట్‌ వేసుకున్నారు.
 
కాగా కరోనా బాధితుడు మే 25న చికిత్స కోసం బల్రాంపూర్‌ ఆస్పత్రిలో చేరాడు. అయితే పరిస్థితి విషమించడంతో మే 28న మరణించాడు. అతని మృతదేహాన్ని కోవిడ్‌ నియమ నిబంధనల ప్రకారం అతని బంధువులకు అప్పగించారు. 
 
అయితే రోగి మృతదేహాన్ని బంధువులు నదిలో పడేసినట్లు తమకు సోషల్‌ మీడియా ద్వారా తెలిసినట్లు బల్రాంపూర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ బిబి సింగ్‌ తెలిపారు. కాగా మృతదేహాన్ని తిరిగి వారికి అప్పగించి వారిపై కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు.
 
కాగా, ఈ ఘటనపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి గజేంద్ర శేఖవత్ ట్విట్టర్‌లో స్పందించారు. గంగా నదిలో మృతదేహాలను వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. వీటిని నిషేధించడానికి చర్యలు తీసుకున్నాం. 
 
అంతేకాకుండా ఇటువంటి సంఘటనలను తనిఖీ చేయడానికి నది తీరాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాలను కోరింది. కోవిడ్-19 నియమ నిబంధనల ప్రకారం మృతదేహాలను పారవేయాలని, 14 రోజుల్లోగా దీనిపై నివేదిక పంపాలని ఆ రాష్ట్రాలకు సూచించింది.
 
ఈ నెల ప్రారంభంలో బీహార్, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో గంగా నది ఒడ్డుకు వందలాది మృతదేహాలు కొట్టుకు వచ్చిన సంగతి తెలిసిందే. బక్సర్ జిల్లాలో 71 మృతదేహాలను నదీతీరం నుంచి స్వాధీనం చేసుకున్నారు. గంగానది పక్కన ఉండే ఇసుక డంపింగ్‌లలో వేలాది ఇతర మృతదేహాలు ఖననం చేసినట్టు స్థానిక అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే.