మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (18:25 IST)

అఖిలపక్ష భేటీకి కాఫీ - టీ కోసం వెళ్లమంటారా?: పవన్ కళ్యాణ్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీ తరపున ప్రతినిధులను పంపించడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వం సరఫరా చేసే

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీ తరపున ప్రతినిధులను పంపించడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వం సరఫరా చేసే బిస్కెట్లు, కాఫీ, టీల కోసం వెళ్ళబోమని ఆయన తేల్చి చెప్పారు. 
 
శుక్రవారం విజయవాడ బెంజి సర్కిల్‌లో ఆయన లెఫ్ట్ పార్టీల నేతలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర అనంతరం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ విషయంలో ఏ తప్పు చేశారో, ఇప్పుడు అమరావతి విషయంలోనూ చంద్రబాబు అదే తప్పు చేస్తున్నారని మండిపడ్డారు. 
 
ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, హైదరాబాద్‌ను తానే నిర్మించానని చెప్పుకుంటున్న చంద్రబాబు, కేవలం సైబరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ఆపై ఔటర్ రింగ్ రోడ్డుతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కగా, అంతే విధ్వంసం కూడా జరిగిందని, చిన్న రైతుల నుంచి భూమిని లక్షలకు కొన్న కొందరు బడాబాబులు కోట్లకు పడగలెత్తారని అన్నారు.
 
దీంతో అభివృద్ధిలో తమకు భాగం లేకుండా పోయిందన్న భావన ప్రజల మనసుల్లో చేరిందని, ఆంధ్రా ప్రజలపై తెలంగాణ వాసుల కోపానికి కారణం అదేనని, ఇప్పుడు అమరావతి విషయంలోనూ ఇదే జరుగుతోందని పవన్ ఆరోపించారు. కేవలం అమరావతిని మాత్రమే చూసుకుంటే, రాయలసీమ, కళింగ ఉద్యమాలు వస్తాయని హెచ్చరించిన ఆయన, పాలకుల తప్పిదాల కారణంగానే అస్థిత్వ పోరు మొదలవుతోందని ఆయన హెచ్చరించారు.