కన్నీళ్లు పెట్టుకున్న వరుడు.. ఎందుకో తెలుసా?
సాధారణంగా వివాహం అంటేనే వరుడు ఎగిరి గంతేస్తాడు. కానీ ఇక్కడ ఓ వరుడు మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే తన పెళ్లికి నాన్న హాజరు కాలేదని భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సంఘటన జెడ్డాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సంతోష్ నగర్‌కు చెందిన మహ్మద్ ఇమ్దాద్ అలీ జెడ్డాలో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.
అయితే అలీ వివాహం గతేడాది మార్చిలో జరపాలని జెడ్డాలోనే నిర్ణయించారు. ఎందుకంటే అలీ బంధువులు దాదాపు అక్కడే స్థిరపడ్డారు కాబట్టి. అంతలోనే కరోనా లాక్‌డౌన్ విధించడంతో పెళ్లి వాయిదా పడింది. అలీ తల్లిదండ్రులు జెడ్డా వెళ్లలేకపోయారు.
ఇప్పటికీ కూడా వారికి వీసా రాలేదు. దీంతో పెళ్లి ఆలస్యమవుతుందని భావించి ఇరు కుటుంబాల పెద్దలు లేకుండానే నిఖా జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వరుడు తల్లిదండ్రులు లేకుండానే అలీ నిఖా జరిపించారు. ఈ సమయంలో తండ్రిని గుర్తు చేసుకుని అలీ భావోద్వేగానికి లోనయ్యాడు.