1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (22:37 IST)

రైతన్నలందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు

Farmer-Eruvaka
వేసవిలో మండే ఎండలకు వీడ్కోలు పలుకుతూ తొలకరి తెలుగు వారింట అడుగుపెట్టింది. తరలివచ్చిన తొలకరి జల్లులతో నేల తల్లి పులకరించే మధుర క్షణాలు ఏరువాక పౌర్ణమి. జూన్ 14 అంటే... మంగళవారం నాడు ఏరువాక పౌర్ణమి. రైతన్నలు తమ పంటసాగును పవిత్రంగా ప్రారంభించే పరమ పవిత్రమైన రోజు ఇది.

 
ఈ పవిత్రమైన ఏరువాక పౌర్ణమి నాడు రైతులు తమకు పంటను ప్రసాదించే భూమి తల్లిని పూజిస్తారు. ఎద్దులకు పసుపు, కుంకుమలతో అందంగా అలంకరిస్తారు. మూపురాలకు నమస్కరించి వృషభ పూజ చేస్తారు. నాగలికి హల ప్రవాహ పూజను నిర్వహిస్తారు. 

 
ఎడ్లను కాడికి పూన్చి, ఇంటి ఇల్లాలు నీళ్ళ బిందెతో ఎదురురాగా, ధాన్యలక్ష్మీని ఇంటికి తోడ్కోని తెచ్చే బసవన్నలను అలంకరించి, పూజించి, దుక్కి దున్నడానికి శుభసూచకంగా టెంకాయ కొట్టి, తలపాగా చుట్టి నాగళ్ళతో సాగుకు శ్రీకారం చుడతారు. ఈ పర్యాయం ఏరువాక పౌర్ణమికి బుతుపవనాలు రావడం, పలకరించడంతో ఆనందంతో సాగుకు సమాయత్తమవుతున్నారు. ఈ ఏరువాక సందర్భంగా రైతన్నలందరికీ శుభకాంక్షలు తెలియజేద్దాం.