నిజమైన విలన్ చంద్రబాబే.. ఎన్టీఆర్‌ను క్షోభ పెట్టింది.. వాళ్లే?: నాదెండ్ల
''మహానాయకుడు'' సినిమాపై మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు సంచలన కామెంట్స్ చేశారు. నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానాయకుడులో తనను విలన్‌గా చూపెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఎన్టీఆర్ వారసులు తీసిన సినిమా విషయంలో అంతకంటే ఎక్కువ ఆశించలేమని.. వాపోయారు. అసలు విలన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే అని.. నిజాలు చెప్పేంత ధైర్యం వారికి లేదంటూ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకొమ్మని చంద్రబాబు నాయుడు తన వద్దకు వచ్చారన్నారు. ఎన్టీఆర్ మృతికి కారకులు ఆయన కుటుంబ సభ్యులేనని ఎన్టీఆర్‌ను తీవ్రంగా క్షోభ పెట్టింది వారేనని తెలిపారు.
ఎన్టీఆర్ తిండి కోసమని కొంత సొమ్మును తన వద్ద వుంచుకుంటే.. ఆ విషయంలోనూ కోర్టుకు వెళ్లిన వారు.. ఎన్టీఆర్ వారసులని.. నాదెండ్ల చెప్పారు. ఎన్టీఆర్ ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా చేసి ఆయన్ని హింసించారని అన్నారు.
ఆ సమయంలో ఎన్టీఆర్‌కు లక్ష్మీ పార్వతి సపర్యలు చేసిందని.. ఆయన గెలిచాకా.. మళ్లీ ఆయన చుట్టూ చేరిన ఘనత ఎన్టీఆర్ వారసులదని నాదెండ్ల భాస్కరరావు వెల్లడించారు. సినిమాలతో నిజాలను మార్చలేరన్నారని నాదెండ్ల చెప్పుకొచ్చారు.