శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 9 అక్టోబరు 2019 (17:19 IST)

ఆస్తి కోసమా? అక్రమ సంబంధం సుఖం కోసమా? ఆరుగుర్ని చంపిన మహిళ

కేరళలో సంచలనం సృష్టిస్తున్న సీరియల్ కిల్లర్ కేసు. ఇదేదో మగవాడు చేసింది కాదు. ఓ స్త్రీ పథకం ప్రకారం గత 19 ఏళ్లుగా ఆచితూచి తను అనుకున్నవిధంగా హత్య చేస్తూ వచ్చింది. తొలుత అత్తమామలను, ఆ తర్వాత భర్తను, అనంతరం భర్త సోదరుడి భార్యాబిడ్డలను చంపేసింది. 
 
ఈమె ఈ దారుణానికి పాల్పడటం వెనుక ఆస్తి కోసమేనని చెపుతున్నారు. ఎందుకంటే అత్తమామల పేరుపైన కోట్లలో ఆస్తి వుంది. ఆ ఆస్తి అంతా ఉన్నఫళంగా అనుభవించేయాలన్న మిషతో వారిద్దర్నీ పైకి పంపేసింది. ఆ తర్వాత ఫోకస్ భర్త పైన పెట్టి అతడిని మట్టుబెట్టింది. 
 
కుటుంబంలో అంతా అంతమయ్యారు కనుక ఆస్తి ఆమెకి బదిలీ అయిపోయింది. ఐతే ఆమె అంతటితో ఆగలేదు. తన భర్త సోదరుడి కుటుంబంపైన కన్నేసింది. ఎందుకంటే అతడికి కూడా కోట్లలో ఆస్తి వుంది. అనుకున్నప్రకారం భర్త సోదరుడితో సన్నిహితంగా వుంటూ అతడి భార్యాబిడ్డలను లేపేసింది. ఆ తర్వాత ఎంచక్కా అతడిని పెళ్లాడింది. 
 
ఐతే వరుసగా చేసిన హత్యలన్నిటినీ సహజ మరణాలుగా చిత్రీకరించడంలో ఆమె పూర్తిగా సఫలమైంది. ఎందుకంటే ఒక్కొక్కర్నీ చంపేందుకు సంవత్సరాల తరబడు టైం తీసుకుంది. 2002లో మొదలైన ఈ సీరియల్ కిల్లింగ్ ఈ ఏడాది వరకూ సాగుతూ వచ్చింది. 
 
తన భర్త సోదరుడిని పెళ్లాడిన తర్వాత అతడిని కూడా అంతమొందించి ఆస్తినంతా కాజేద్దామన్న ప్రణాళిక రంచించిందని అంటున్నారు. కాగా వీరందరినీ బంగార నగల దుకాణంలో వుండే సైనైడ్ వేసి చంపేసినట్లు పోలీసులు నిర్థారించారు. ఐతే ఈమె ఇలా కుటుంబ సభ్యులను హత్య చేయడం వెనుక ఆస్తి కోసమా... లేదంటే అక్రమ సంబంధం సుఖం కోసమా... అదీ కాదంటే ఆమె సైకోగా మారిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు కేరళలో సంచలనం సృష్టిస్తోంది.