కోడెల శివప్రసాద్ ఆత్మహత్యా లేదా గుండెపోటా? వైద్యులేమంటున్నారు?
గుంటూరు జిల్లాలో పల్నాటి పులిగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఆయన్ను కోడెల ఇంటికి సమీపంలో ఉన్న బసవతారకం ఆస్పత్రికి తరలించగా అక్కడ చనిపోయినట్టు సమాచారం. అయితే, వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు.
1947 మే 2న కండ్లగుంటలో జన్మించిన కోడెల.. గుంటూరు ఏసీ కాలేజీలో పీయూసీ చేశారు. ఆ తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసి.. కర్నూల్ మెడికల్ కాలేజీలో ఎంఎస్ పూర్తి చేశారు. ఇక ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిన కోడెల.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనూ మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 19వరకు ఏపీ స్పీకర్‌గానూ పనిచేశారు. ఆయనకు భార్య శశికళ, కుమార్తె విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు శివ రామకృష్ణ, సత్యనారాయణలు ఉన్నారు.
ఇటీవలే గుండెపోటుకు గురైన ఆయన గుంటూరులో తన కుమార్తెకు చెందిన ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత చుట్టుముట్టిన కేసులు, రాజకీయ వేధింపుల కారణంగా ఆయన తీవ్ర మానసికఒత్తిడికి గురవుతూ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు. అయితే, మరోవర్గం నేతలు మాత్రం ఆయనకు గుండెపోటు వచ్చిందనీ ఆ కారణంగా చనిపోయినట్టు ప్రచారం సాగుతోంది.
మరోవైపు, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై పలు కేసులను నమోదు చేశారు. అసెంబ్లీ ఫర్నీచర్‌ను తన కార్యాలయానికి, తన కుమారుడు శివరామ్ నిర్వహిస్తున్న షోరూమ్‌కు తరలించారని కోడెలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోడెలపై అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసెంబ్లీ అధికారులు కోడెల క్యాంపు కార్యాలయం, గుంటూరులోని గౌతమ్ హీరో షోరూంలో అసెంబ్లీ ఫర్నిచర్‌ను గుర్తించారు. అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్‌లో ఉంచి వినియోగించుకుంటున్న నేపథ్యంలో తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. కోడెల శివ ప్రసాద్‌పై ఐపీసీ 409 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు తనది కాని ప్రభుత్వ ఆస్తిని షోరూంలో ఉంచుకుని వినియోగిస్తున్న కోడెల శివరామ్‌పై ఐపీసీ 414 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే.