ప్రతి ఒక్కరూ అభిమానించే నేతను కోల్పోయాం : జైట్లీ మరణంపై సోనియా భావోద్వేగ లేఖ
బీజేపీ సీనియర్, మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ భావోద్వేగ లేఖ రాశారు. ప్రతి ఒక్కరూ అభిమానించే నేతను కోల్పోయినట్టు అందులో పేర్కొన్నారు. ఈ మేరకు అరుణ్ జైట్లీ భార్య సంగీతా జైట్లీకి ఆమె లేఖ రాశారు. "ఈ కష్టకాలంలో మీ బాధను పంచుకోవడానికి నేను ఉన్నాననే భరోసా మాత్రం ఇవ్వగలను" అని అందులో పేర్కొన్నారు.
సోనియా లేఖలోని సారాంశాన్ని పరిశీలిస్తే, "జైట్లీ మరణించారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన స్వభావంతో పార్టీలకతీతంగా మిత్రులు, అభిమానుల్ని సంపాదించుకున్నారు. కేంద్ర మంత్రి, సుప్రీం కోర్టు న్యాయవాది, ప్రతిపక్ష నేత ఇలా ఏ పదవిలో ఉన్నా.. ఆయన గొప్ప వాగ్ధాటి, విజ్ఞతను ప్రదర్శించారు.
ఇంకా దేశానికి ఎంతో చేయాల్సి ఉన్న తరుణంలో, చిన్న వయసులో మరణించడం జీర్ణించుకోలేని విషయం. ఈ సమయంలో మాటలు ఓదార్పును చేకూర్చలేవని తెలుసు. ఈ కష్టకాలంలో మీ బాధను పంచుకోవడానికి నేను ఉన్నాననే భరోసా మాత్రం ఇవ్వగలను. దేశం గొప్ప ప్రజానాయకుణ్ని కోల్పోయింది. పార్టీలకతీతంగా అందరూ అభిమానించే గొప్ప నేతని కోల్పోయాం. అరుణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా" అని సోనియా తన సంతాప సందేశాన్ని సంగీతాకు పంపారు.