శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (20:00 IST)

భారత్‌లోకి ఒమిక్రాన్ వేరియంట్ ఎంట్రీ : నిర్ధారించిన కేంద్ర ఆరోగ్య శాఖ

ఆఫ్రికా దేశాల్లో పురుడు పోసుకుని ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ వైరస్ భారత్‌లోకి ప్రవేశించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్‌లో ఇప్పటివరకు రెండు కేసులను గుర్తించినట్టు తెలిపింది. ఈ రెండు కేసులు కూడా కర్నాటక రాష్ట్రంలోనే నమోదయ్యాయి. వీరిలో ఒకరు విదేశీ పౌరుడు. ఈ ఇద్దరు రోగుల వయస్సు 44 యేళ్లు, 66 యేళ్లుగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. మరో ఇద్దరి కరోనా పాజిటివ్ రోగుల శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సెస్‌కు పంపించారు. 
 
మరోవైపు, ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన సౌతాఫ్రికాలో కొత్తగా నమోదవుతున్న కేసులు భయపెడుతున్నాయి. ఒక్క రోజులోనే ఈ కేసుల సంఖ్య రెట్టింపు కావడం మరింత ఆందోళనకు గురిచేస్తుంది. సౌతాఫ్రికాలో మంగళవారం 4373 కేసులు ఉండగా, బుధవారం నాటికి ఈ కేసుల సంఖ్య 8561కి చేరుకుంది. ఈ కేసుల సంఖ్యను పరిశీలించిన సౌతాఫ్రికా శాస్త్రవేత్తలు.. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి శరవేగంగా సాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.