శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2019 (11:16 IST)

ఇండో-పాక్ వార్ తథ్యమా? సికింద్రాబాద్ నుంచి బలగాల తరలింపు

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనివుంది. ముఖ్యంగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని పాకిస్థాన్ సర్కారు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. పైగా, భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులను సరిహద్దుల వెంబడి పంపుతోంది. పైగా, కయ్యానికి కాలుదువ్వుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనివుంది. ఓ వైపు యుద్ధం తప్పదని పాకిస్థాన్ హూంకరిస్తోంది, మరోవైపు పీఓకే కూడా స్వాధీనం చేసుకుంటామని భారత్‌ ప్రకటనలపై ప్రకటనలు కుమ్మరిస్తోంది. ఈ పరిస్థితుల్లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి మూడురోజులుగా సైనిక బలగాలను రోడ్డు, వాయు మార్గాల్లో జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి తరలిస్తోంది. 
 
ఇదే ఇపుడు చర్చనీయాంశంగా మారింది. నిజంగానే భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం వస్తోందా అన్న చర్చ సాగుతోంది. సైనిక బలగాల తరలింపుపై అధికారులు నోరు మెదపడం లేదు. దేశభద్రకు సంబంధించిన అంశం కావున వివరాలు అడగవద్దని చెబుతున్నారు. వాస్తవానికి 370 ఆర్టికల్‌ రద్దు తర్వాత నుంచి భారీగా బలగాలను కశ్మీర్‌కు తరలిస్తున్నారు.