గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (22:29 IST)

కరోనాను లెక్క చేయకుండా రేవ్ పార్టీలో జల్సా.. మహిళా పోలీస్ సస్పెండ్

కరోనా వైరస్ ఓ వైపు విజృంభిస్తుంటే మరోవైపు అధికారాలను దుర్వినియోగం చేసి జల్సాలకు పాల్పడుతున్నారు కొందరు పోలీసులు. ఒక మహిళా పోలీస్ అయితే ఏకంగా రేవ్ పార్టీలో పాల్గొన్న వార్త హల్ చల్ చేస్తోంది. చట్టాన్ని కాపాడాల్సిన వారే అతిక్రమించడంతో ఆమెను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే, అలూరు తాలుకాలో ఓ రిసార్టులో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. 130 మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నా కార్లను సీజ్ చేశారు. ఇందులో ఓ మహిళా పోలీసు కూడా ఉన్నారు. ఈమె మంగళూరు జిల్లాలో క్రైం విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈ పార్టీలో పాల్గొనడానికి ఈమె.. సెలవు పెట్టి మరీ వచ్చినట్లు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎన్.శశి కుమార్ వెల్లడించారు. పార్టీ నిర్వహించే ప్రాంతాన్ని చివరి నిమిషం వరకు పొక్కకుండా గోప్యంగా ఉంచారని, రిసార్ట్ యజమాని గగన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిలో బెంగళూరు, గోవా, మంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. లిక్కర్‌తో పాటు నిషేధిత మత్తు పదార్థాలు 50 టూ వీలర్లు, 20 కార్లను స్వాధీనం చేసుకున్నారు.