శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 24 జనవరి 2019 (12:24 IST)

భారత జవానుగా మారిన ఉగ్రవాదికి 'అశోకచక్ర'

ఒకపుడు కాశ్మీర్ లోయల్లో భారత జవాన్లకు ముచ్చెమటలు పట్టించిన ఉగ్రవాది. పలువురు జవాన్లపై దాడిచేసి గాయపరిచిన వ్యక్తి. తీవ్రవాద కార్యక్రలాపాలను పూర్తిగా వదిలేశారు. ఆ తర్వాత భారత ఆర్మీలో చేరి ఓ వీర సైనికుడిగా మారిపోయాడు. ఉగ్రవాదం కంటే భారతమాత సేవ గొప్పదని భావించాడు. ఇండియన్ ఆర్మీలో చేరి ఉగ్రవాద నిర్మూలన కోసం పరితపించాడు. ఆ క్రమంలో తన ప్రాణాలను కోల్పోయాడు. అతని పేరు నాజిర్ అహ్మద్ వనీ. 
 
ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చేందుకు వెళ్లి... ఆ ముష్కర మూకల నుంచి తన సహచరులను రక్షించి చివరకు తాను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. ఇపుడు అతని సేవలను కేంద్రం గుర్తించింది. ఫలితంగా సైనికులకు ఇచ్చే అవార్డుల్లో ప్రతిష్టాత్మక అశోకచక్ర పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. ఈనెల 26వ తేదీన జరిగే గణతంత్ర వేడుకల్లో ఈ అవార్డును ఆయన కుటుంబీకులకు అందించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈయనకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
2004 సంవత్సరానికి ముందు ఉగ్రవాదిగా అనేక దాడుల్లో పాల్గొన్న వనీ... ఆ తర్వాత భారత సైన్యానికి లొంగిపోయాడు. అనంతరం భారత సైనికులు చేపట్టే కౌంటర్ ఇన్‌సర్జెన్సీ ఆపరేషన్‌లో పాలుపంచుకుని తన నిబద్ధతను చాటుకున్నాడు. దీంతో ఆర్మీ ఉన్నతాధికారులు వనీకి 162వ బెటాలియన్‌లో చోటు కల్పించారు. కుల్గాంకు చెందిన వనీ, సైనికుడిగా రెండుసార్లు సేవా మెడల్ పురస్కారాన్ని అందుకోవడం గమనార్హం.