సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (15:33 IST)

చైనా అధ్యక్షుడి కోసం మహాబలిపురం సిద్ధం... ఈ ప్రాంతమే ఎందుకు?

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించనుంచారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన భేటీకానున్నారు. జిన్‌పింగ్ - మోడీల భేటీ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకు సమీపంలోని మహాబలిపురంలో జరుగనుంది. ఈ భేటీ కోసం మహాబలిపురం ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తయారుచేశారు. 
 
అయితే, భారత్ - చైనా దేశాధినేత సమావేశానికి మహాబలిపురం ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారన్న చర్చ ఇపుడు సాగుతోంది. భారత్‌లో అనేక చారిత్రక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వీటిని ప్రమోట్ చేసే ఉద్దేశ్యంతో ప్రధాని మోడీ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు సమాచారం. ముఖ్యంగా, దేశంలో ఉన్న వివిధ టూరిస్టు డెస్టినేషన్లు ఇతర దేశాల ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తాయని, ఇలాంటి చోట్ల టాప్ గ్లోబల్ లీడర్లతో ముఖ్యమైన సమావేశాలు నిర్వహించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని ప్రధాని మోడీ ఆలోచనగా ఉంది. 
 
ఇతర దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానుల రాకతో ఈ పర్యాటక ప్రదేశాలు ఎంతో పాపులర్ అవుతాయని మోడీ బలంగా నమ్ముతున్నారు. పైగా ఆయా దేశాల ప్రజల మధ్య స్నేహ, సౌభ్రాత్రాలకు కూడా ఈ విధమైన టూరిస్టు ప్రాంతాలు ఉపకరిస్తాయని ఆయన తరచూ అంటుంటారు. బహుశా ఈ కారణంగానే మోడీ.. 2017 ఏప్రిల్‌లో.. కోల్‌కతాలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో సమావేశమయ్యారు. అదే యేడాది గుజరాత్‌లోని శబర్మతీ నదీ తీరంలో భారత-చైనా సమ్మిట్ జరిగింది. 
 
దేశంలో అత్యద్భుత శిల్ప కళకు, ఆలయాలకు మారుపేరైన మహాబలిపురంలో మోడీ-జీ జిన్ పింగ్ భేటీ వ్యూహం వెనుక ఓ బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. క్రీ.శ. ఏడో శతాబ్దంలో పల్లవ వంశస్థుల రాచరిక పాలనలో మొదటి నరసింహవర్మన్ ఈ నగరాన్ని నిర్మించాడు. చెన్నైకి సుమారు యాభై కి.మీ. దూరంలోని ఈ సిటీ.. ఇతర దేశాలతో వ్యాపార లావాదేవీలకు అనువుగా ఉండేది. అందువల్లే ఆ పల్లవ రాజు ఇక్కడ రేవును కూడా నిర్మించాడు. 
 
నాడు పల్లవులు తమ రాయబారులను ముఖ్యంగా చైనాకు పంపేవారు. ఆ సమయంలో భారత-చైనా దేశాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటూ వచ్చింది. అరబ్బులు, టిబెటన్ల విషయంలో చైనా పాలకులకు రెండో నరసింహవర్మన్ కూడా తోడ్పాటు నందిస్తూ వచ్చాడు. పైగా ఒకనాడు చైనా ట్రావెలర్ హ్యూన్ త్సాంగ్ ఈ ప్రాంతంలో పర్యటించాడు.
 
అంటే దాదాపు రెండు వేల ఏళ్ళ నాటి నుంచే చైనా-భారత్ మధ్య లింకులున్నట్టు పురావస్తు ఆధారాలు కూడా లభించాయని చరిత్రకారులు అంటున్నారు. క్రీ.పూ. మొదటి, రెండో శతాబ్దంలో తమిళనాడు తీర ప్రాంతాల్లో సముద్ర జలాల ద్వారా చైనా-భారత దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు సాగేవట. అక్కడ నాడు లభించిన కుండలు, ఇతర మట్టి పాత్రలు ఈ విషయాన్నినిరూపించాయి. 
 
తమిళనాట నాడు చైనా నాణేలు దొరికాయని చెబుతున్నారు. ఇన్ని కారణాల వల్లే చైనా అధినేత జీ జిన్ పింగ్ కూడా 'సై' అంటూ మహాబలిపురం పర్యటనకు సమ్మతించినట్టు సమాచారం. అయితే, సదస్సు మాత్రమే అక్కడ జరుగుతుండగా, ఇరు దేశ అధినేతలు మాత్రం చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో బస చేస్తారు. ఇందుకోసం చెన్నై గిండీలోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్‌ను ఎంపిక చేశారు.