ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన-ఇండోర్ యువతి వీడియో వైరల్ (Video)
ట్రాఫిక్ చలానాల రుసుములు విపరీతంగా పెంచినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. చాలామంది వాటిని తప్పించుకోవడమెలా అని ఆలోచిస్తున్నారు తప్పితే ట్రాఫిక్ నిబంధనలు పాటించేందుకు ఇష్టపడట్లేదు. పోలీసులు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఇండోర్‌కు చెందిన ఓ యువతి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాలు.. ఇండోర్‌కు చెందిన శుభీ జైన్ అనే యువతి పుణెలో ఎంబీఏ చదువుతోంది.
నడిరోడ్డుపై డాన్స్ చేస్తూ ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించవద్దంటూ, హెల్మెట్ ధరించాలంటూ రోడ్డుపై స్టెప్పులు వేస్తూ చెప్తోంది. అయితే తాను చేపట్టిన అవగాహన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఆదరణే లభిస్తోందని ఆమె చెప్పుకొచ్చింది.
గత 15 రోజులుగా స్వచ్ఛందంగా అవగాహన కార్యక్రమం చేపడుతున్నాని తెలిపింది. దేశం కోసం ఏదైనా చేయాలన్న తపనతో శుభీ జైన్ ఈ వినూత్న ఆలోచనకు నాంది పలికింది. వాహనదారులు తాను చేస్తున్న పనికి చిరునవ్వుతో బదులివ్వటం మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.