శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2020 (14:47 IST)

మేడారం మహాజాతర.. పాము కనిపిస్తే.. వనదేవతల ఆశీర్వాదం.. ఒక్క ఈగ వాలదు తెలుసా?

ఫిబ్రవరి 8 (శనివారం)తో మేడారం మహాజాతర ముగియనుంది. ఈ రాత్రికి సమ్మక్క, సారమ్మ దేవతల వన ప్రవేశంతో మహాక్రతువు ముగుస్తుంది. మూడు రోజులుగా కుంభమేళాను తలపించే విధంగా మేడారం పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. లక్షలాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. ఇసుకేస్తే రాలనంత జనంతో మేడారం కిక్కిరిసిపోయింది. 
 
మేడారం మహాజాతర కోసం తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కుటుంబంతో సహా.. గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కూడా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతర నేటితో ముగియనుండటంతో భారీ సంఖ్యలో భక్తులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. 
 
బుధవారం (ఫిబ్రవరి 05,2020) నాడు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెపైకి తీసుకొచ్చారు. సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చే క్రతువు కోలాహలంగా సాగింది. గురువారం నాడు చిలకలగుట్ట నుంచి సమ్మక్క దిగి వచ్చి గద్దెపై ఆశీనురాలైంది. 
 
చిలకలగుట్టపై నుంచి మేడారం గద్దెల వరకు సమ్మక్కను తీసుకొచ్చే ఘట్టం ఉద్విగ్నభరితంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగింది. సమ్మక్క పూజారులను దైవాంశ సంభూతులుగా భావించి భక్తులు వారిని తాకేందుకు పోటీపడ్డారు. పెద్దమ్మ రాకతో గద్దెలు కొత్త కళను సంతరించుకొన్నాయి. ఫిబ్రవరి 8న మేడారం జాతర ముగియనుంది. 
 
ఇకపోతేయయ అటవీ ప్రాంతంలోని తాడ్వాయి మండలం ఊరట్టం పంచాయతీ పరిధిలోని ఈ గ్రామంలో 80 గిరిజన కుటుంబాలు ఉంటాయి. మారేడు చెట్లు ఎక్కువగా ఉన్నందున ఈ ఊరికి మేడారం అని పేరు వచ్చిందని చెబుతుంటారు. మేడారంలో సమ్మక-సారలమ్మ గద్దెలు జమ్మిచెట్టు కింద ఉంటాయి. ఈ జమ్మి చెట్టుపై పాము కనబడితే వనదేవతల ఆశీర్వాదం తమకు లభించినట్టు భావిస్తారు. 
 
అంతేకాదు తమ కోర్కెలు నెరవేరిన భక్తులు మేడారంలో బంగారంగా బెల్లం సమర్పించినా, జాతర నాలుగు రోజులూ ఒక్క ఈగ కూడా కనిపించకపోవడం మరో అద్భుతం. నాలుగు రోజులు వేలాది టన్నులు బెల్లం భక్తులు సమర్పిస్తారు. దేవతలు గద్దెనెక్కి వనప్రవేశం చేసేంత వరకూ ఈగలు ఈ చుట్టుపక్కలు కనిపించవు. అమ్మవార్లు వనప్రవేశం చేసిన తర్వాత మాత్రం ఈగలు పెద్దఎత్తున చుట్టుముడతాయి.