శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (10:54 IST)

డీఎంకే అధినేతగా ఎంకే స్టాలిన్.. ఏకగ్రీవంగా ఎన్నిక

69 యేళ్ల ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) అధ్యక్షుడిగా 66 యేళ్ళ ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె. అన్బళగన మంగళవారం ఉదయం అధికారికంగా ప్రకటించారు.

69 యేళ్ల ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) అధ్యక్షుడిగా 66 యేళ్ళ ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె. అన్బళగన మంగళవారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. డీఎంకే అధినేతగా 50 యేళ్ల పాటు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కొనసాగారు. ఇటీవలే ఆయన అనారోగ్యం కారణంగా చనిపోయారు. దీంతో ఆ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక పార్టీ నియమనిబంధనల మేరకు జరిగింది.
 
అధ్యక్ష పదవి కోసం స్టాలిన్‌ మాత్రమే నామినేషన్‌ దాఖలు చేశారు. ఇతరులెవ్వరూ నామినేషన్‌ వేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైపోయింది. అంతేగాక అధ్యక్షుడిగా స్టాలిన్‌ పేరును 65 జిల్లాల కార్యదర్శులు కూడా ప్రతిపాదించారు. దీని గురించి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వున్న పార్టీ ప్రిసీడియం కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి మంగళవారం అధికారికంగా పార్టీకి నివేదించనున్నారు. 
 
స్థానిక తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్‌ స్టాలిన్‌ అధ్యక్ష నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆయన కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా కరుణ నమ్మినబంటు, స్టాలిన్‌ ఆత్మీయుడు దురైమురుగన్‌ డీఎంకే కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఆయన పదవికి కూడా మరెవ్వరూ నామినేషన్‌ వేయక పోవడంతో ఆయన కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
 
ద్రావిడ పితామహుడు తందై పెరియార్‌తో విభేదించిన అన్నాదురై ద్రావిడకళగం నుంచి విడివడి 1949లో డీఎంకే పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి ఆయన వ్యవస్థాపకుడైనప్పటికీ ప్రధాన కార్యదర్శి పదవిని మాత్రమే స్వీకరించారు. తన గురువైన పెరియార్‌ కోసం పార్టీ అధ్యక్ష పదవిని అట్టిపెట్టినట్టు డీఎంకే వర్గాలు చెబుతుంటాయి. అయితే పార్టీ నిర్వహణ కోసం ప్రధాన కార్యదర్శికే అన్ని అధికారాలు పెట్టుకున్నారు. ఆయన ఆ పదవిలో వుండే ముఖ్యమంత్రి పీఠమెక్కారు. అయితే అనారోగ్యంతో 1969లో అన్నాదురై కన్నుమూయడంతో.. ఆయన క్యాబినెట్‌లో ప్రజాపనులశాఖ మంత్రిగా వున్న కరుణానిధి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ నియమావళిని మార్చి, అధ్యక్ష పదవిని సృష్టింపజేయించారు. అనంతరం అధ్యక్ష పదవిని తానే అలంకరించారు.
 
యాభైయేళ్లపాటు ఆ పదవిలో వున్న కరుణానిధి.. గత 8వ తేదీన కన్నుమూయడంతో అధ్యక్ష స్థానం ఖాళీ అయింది. ఆ పదవిని స్టాలిన్‌ భర్తీ చేయనున్నారు. దాంతో 69 ఏళ్ల డీఎంకే పార్టీకి 66 ఏళ్ల స్టాలిన్‌ 2వ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. ఇదిలావుండగా గతంలో కరుణానిధి ఆరోగ్యం క్షీణించడంతో 2017 జనవరి 4వ తేదీన డీఎంకే కార్యవర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. అధ్యక్షుడు క్రియాశీలకంగా వ్యవహరించలేనందున స్టాలిన్‌ను కార్యాచరణ అధ్యక్షుడిగా నియమించింది. అంతేగాక అధ్యక్షుడికి వున్న అధికారాలన్నీ ఆయనకు అప్పగించింది. ఇప్పుడు స్టాలిన్‌ అధ్యక్షుడు కావడంతో డీఎంకేలో కార్యాచరణ అధ్యక్షుడి పదవిని మంగళవారం రద్దు చేయనున్నారు. 
 
ఇకపోతే, ఆది నుంచి దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని వెన్నంటి వున్న స్టాలిన్‌.. ఆయన బాటలోనే పయనించారు. పార్టీ సిద్ధాంతాల అమలు, క్రమశిక్షణతో పాటు పదవుల్నీ అలాగే అలంకరించారు. కరుణ మొదట్లో డీఎంకే కోశాధికారిగా వ్యవహరించారు. స్టాలిన్‌ కూడా 2008లో డీఎంకే కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. కరుణ అన్నాదురై క్యాబినెట్‌లో ప్రజాపనులశాఖ మంత్రిగా వ్యవహరించగా, స్టాలిన్‌ కూడా తండ్రి క్యాబినెట్‌లో ఆ పదవిని అధిరోహించారు. అదేవిధంగా కరుణ అలంకరించిన అధ్యక్ష పదవీ బాధ్యతలనూ స్టాలిన్‌ నెత్తికెత్తుకోనున్నారు.