చిన్నారి నోట్లో అతుక్కుపోయిన అట్ట ముక్క.. మచ్చ అనుకుని ఆస్పత్రికి?
చిన్నారులంటే తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ. వారికి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేరు. అలాంటిది.. ఓ చిన్నారి నోటిలో మచ్చలాంటిది కనిపిస్తే ఆ తల్లి షాక్ అయ్యింది. అంతేగాకుండా చిన్నారి నోట్లోని ఆ మచ్చను ఫోటో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతే ఆ ఫోటో కాస్త వైరలై కూర్చుంది. డెరియన్ అనే మహిళ తన చిన్నారి నోటిలో నలుపు రంగులో పెద్ద మచ్చ వుందని భయపడింది.
దాన్ని తొలగించేందుకు వైద్యుల దగ్గరకు వెళ్తే.. అసలు విషయం తెలియవచ్చింది. అక్కడ చిన్నారిని పరిశోధించిన నర్సు.. అది మచ్చేనని చెప్పేసింది. ఇక లాభం లేదనుకుని ఇంటికి తీసుకొచ్చిన చిన్నారి తల్లి.. ఆ మచ్చను చేతిలో తొలగించేందుకు ప్రయత్నించింది.
అయితే అది మచ్చ కాదని చిన్నారి నోటికి అట్ట ముక్క బాగా అతుక్కుపోయిందని కనుగొంది. దీంతో చిన్నారి నోటి నుంచి తొలగించిన అట్టముక్కను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫేస్‌బుక్ పోస్టుకు 24వేల మంది స్పందించారు.