మోడీ కేవలం పబ్లిసిటీ ప్రధానమంత్రి... ఒక్క డీల్‌తో దోచేశారు : చంద్రబాబు వార్నింగ్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీ కేవలం పబ్లిసిటీ ప్రధానమంత్రి అని వ్యాఖ్యానించారు. గత నాలుగున్నరేళ్లలో ఒక్క స్కామ్ కూడా జరగలేదని చెబుతున్న బీజేపీ.. ఒకే ఒక్క రాఫెల్ స్కామ్‌తో దోచేశారని ఆయన ఆరోపించారు.
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలోని బ్రిగేడ్ మైదానంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరుగుతున్న బీజేపీయేతర విపక్ష పార్టీల మెగా ర్యాలీలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ సంస్థలను మోడీ సర్కారు ధ్వంసం చేస్తూ నిర్వీర్యం చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు కూడా ప్రశ్నార్థకంగా మారాయన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ - జేడీఎస్ సర్కారును కూల్చివేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుందన్నారు.
బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంటే, విపక్షాలు మాత్రం దేశాన్ని ఏకం చేసేందుకు కృషి చేస్తున్నాయన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని, విభజన రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీబీఐ, ఆర్బీఐ, న్యాయవ్యవస్థ ఇలా ప్రతి రాజ్యాంగ వ్యవస్థను మోడీ సర్కారు నిర్వీర్యం చేస్తుందన్నారు.
బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం ప్రశంసనీయమని అన్నారు. తమందరికీ దేశమే ముఖ్యమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.