టీడీపీ నేతలకు పౌరుషం లేదు.. పవన్ కళ్యాణ్
తెలుగుదేశం పార్టీ నేతలకు ఏమాత్రం పౌరుషం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతితో కూడిన రాజకీయ వ్యవస్థ నెలకొని ఉందని, దీనిని చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు.
తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఓడిపోవడానికైనా సిద్ధపడతాను కానీ పార్టీ విలువలను చంపనన్నారు. ఏటా సినిమాల ద్వారా రూ.100 కోట్లు సంపాదిస్తే అందులో 25 కోట్లు పన్నులుగా కడతానన్నారు.
అయినా సినిమాలపై మమకారం లేదని సమాజంపై బాధ్యత ఉందన్నారు. కార్యకర్తలు కొట్టే చప్పట్లు, కేరింతలు తనను సంతోష పెట్టవని... వాటిని బాధ్యతగా స్వీకరిస్తానన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరన్నారు. సినిమాలు కేవలం అవగాహన కల్పించడానికేనని, రాజకీయాలు వాటిని పరిష్కరించ డానికి దోహదపడతాయన్నారు.
వ్యాపారులు ఎంపీలుగా వెళ్తుంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయన్నారు. కులాల ముసుగులో ఉన్నవారిని ప్రజాకోర్టులో నిలదీద్దామన్నారు. వాల్మీకి, యోగి వేమనల్లో మార్పు వచ్చినట్టే చంద్రబాబు మనసు కూడా మారుతుందనే చిన్నపాటి నమ్మకంతో 2014లో మద్దతు ఇచ్చానని, అయితే ఆయన ఇంకా నిద్రాణంలోనే ఉన్నారన్నారు. మెట్టుమెట్టుగా ఎదుగుదామన్నారు.