బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (11:12 IST)

డీఎస్ తనయుడిపై నిర్భయ కేసు.. కేసీఆర్ సర్కారు అలా పగ తీర్చుకుందా?

తెరాసకు చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ తనయుడు డి.సంజయ్‌పై తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 11 మంది కాలేజీ విద్యార

తెరాసకు చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ తనయుడు డి.సంజయ్‌పై తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 11 మంది కాలేజీ విద్యార్థినులు ఆ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. దీంతో హోంమంత్రి ఆదేశం మేరకు ఆయనపై నిర్భయ కేసు నమోదు చేశారు.
 
ధర్మపురి సంజయ్ తమను లైగికంగా వేధిస్తున్నాడని విద్యార్థినులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నిజామాబాద్ నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌లో ధర్మపురి సంజయ్‌‌పై శుక్రవారం నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. నర్సింగ్ విద్యార్థినుల ఫిర్యాదుతో సంజయ్‌పై నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 342, 354, 506, 354ఎ(నిర్భయ చట్టం) కింద సంజయ్‌పై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో సంజయ్‌ను అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా.. ఇంట్లో లేరు. దీంతో ధర్మపురి సంజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
నిజానికి ధర్మపురి శ్రీనివాస్ తెరాస రాజ్యసభ సభ్యుడు. ఆయన ఇటీవల తెరాసపై అలిగి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవాలని భావించారు. దీనిపై తీవ్రస్థాయిలో చర్చ కూడా జరిగింది. గ్రూపు రాజకీయాలతో పాటు తనకు ఏమాత్రం గౌరవ మర్యాదలు లేకపోవడంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ, తెరాస సీనియర్ నేతలు బుజ్జగించడంతో పార్టీలో కొనసాగుతున్నారు. డీఎస్‌కు చెక్ పెట్టేందుకే ఆయన తనయుడిపై నిర్భయ కేసు నమోదైందన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.