షర్మిలకు వ్యూహకర్తగా ఛార్జ్ తీసుకున్న ప్రియ
తెలంగాణాలో కొత్తగా పార్టీని ప్రకటించనున్న షర్మిలకు కొత్త వ్యూహకర్తగా ప్రియ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో షర్మిలను లాంఛనంగా కలిసి ఆమెతో పనిచేయడానికి సంసిద్ధత తెలిపారు. దివంగత రాజశేఖరరెడ్డి తనయురాలు షర్మిల వై.ఎస్.ఆర్. తెలంగాణా పార్టీ పేరిట కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు.
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి జులై 8న ఆమె కొత్త పార్టీ ప్రకటన చేయనున్నారు. దీనితో ఇప్పటి నుంచే లోటస్ పాండ్ కార్యాలయంలో సందడి పెరిగింది. ఆమె కొత్త పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా తమిళనాడుకు చెందిన ప్రియ వ్యవహరించనుంది. ప్రియ తమిళనాడులోని తిరువల్లూరు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె. ఆమె, ఆమె తల్లి ఇందిర డి.ఎం.కె. కు సోషల్ మీడియా ఇంచార్జులుగా ప్రచారం చేశారు. వారికి స్టాలిన్ కుటుంబంతో మంచి పరిచయాలున్నాయి.
అక్కడ స్టాలిన్ ఘన విజయంతో ఆ పార్టీ అమలు చేసిన సోషల్ మీడియా స్ట్రాటజీ ఇక్కడ కూడా అమలు చేసే ప్రయత్నంలో ప్రియ ఉన్నారు. పైగా, ప్రియకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో పనిచేసిన అనుభవముంది. ప్రియ తమిళనాడులో ఒక మీడియా సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. షర్మిలకు స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తారని మొదట్లో వార్తలొచ్చాయి. అయితే, ఆయన ఇపుడు కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కొత్త ఫ్రంట్‌ని ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉన్నారు.
ఇక ప్రియ ఆయన శిష్యురాలే కాబట్టి, పి.కె. ఆశీస్సులు కూడా కొత్త పార్టీకి ఉంటాయని చెపుతున్నారు. ముఖ్యంగా ప్రియ షర్మిల కొత్త పార్టీకి సోషల్ మీడియా సపోర్ట్ ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే షర్మిలకు సలహాదారులుగా మాజీ ఐ.ఎ.ఎస్. అధికారులు ప్రభాకర్ రెడ్డి, ఉదయ్ సిన్హా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున షర్మిల రంగంలోకి దిగుతున్నారంటే, ఇక రాజకీయ ఫలితాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి.