నవ శకానికి నాంది పలుకనున్న శివంగి సింగ్... ఎందుకో తెలుసా?
దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ స్థానానికి చెందిన శివంగి సింగ్ నవ శకానికి నాంది పలుకనుంది. ఎందుకంటే... భారత వాయు సేనలో (ఐఏఎఫ్)లో కొత్తగా చేరిన అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపే తొలి మహిళా పైలట్‌గా ఫ్లైట్ లెఫ్టినెంట్ శివంగి సింగ్ అవతరించబోతున్నారు.
2017లో ఐఏఎఫ్‌లో చేరిన ఆమె మహిళల రెండో బ్యాచ్‌లో ఫైటర్ పైలట్‌గా శిక్షణ పూర్తిచేశారు. ఈమె త్వరలోనే అంబాలాలోని 17 స్క్వాడ్రన్‌కు చెందిన రాఫెల్ 'గోల్డెన్ యారోస్'లో భాగంకానున్నారు. దీనికోసం ఆమె ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఇప్పటివరకు మిగ్ -21 బైసన్ యుద్ధ విమానాలు నడిపిన శివంగి సింగ్, ఇటీవలే రాజస్థాన్‌లోని వైమానిక స్థావరం నుంచి అంబాలా ఎయిర్ బేస్‌కు చేరుకున్నారు.
వారణాసిలో ప్రాథమిక విద్య అనంతరం బెనారస్ హిందూ యూనివర్సిటీలో శివంగి సింగ్ చేరారు. 7 యూపీ ఎయిర్ స్క్వాడ్రన్‌లోఎన్‌సీసీ క్యాడెట్‌గా ఉన్న ఆమె అనంతరం 2016 నుంచి ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందారు. పాతకాలపు మిగ్ 21 యుద్ధ విమానం నుంచి మొదలైన ఆమె శిక్షణ ప్రస్తుతం కొత్త తరం రాఫెల్ యుద్ధ విమానం నడపటం వరకు కొనసాగింది.