పురుషుని వేషంలో అయ్యప్ప దర్శనానికి మహిళలు...
శబరిమలలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆలయంలోకి ప్రవేశించేందుకు ఇద్దరు మహిళలు ప్రయత్నించారు. దీంతో అప్పటివరకు ఉన్న ప్రశాంత వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ముఖ్యంగా, ఇద్దరు మహిళలు పురుషుల వేషంలో ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం గమనార్హం.
పంబా బేస్ క్యాంప్ నుంచి నీలమల వచ్చిన వారిద్దరినీ భక్తులు చుట్టుముట్టారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. ఆలయంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన 9 మంది మహిళా బృందంలో ఈ ఇద్దరు ఉన్నారు. మిగిలిన వారిని పంబా వద్దే భక్తులు అడ్డుకున్నారు.
అయ్యప్ప దర్శనానికి అన్ని వయసుల మహిళలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అప్పటి నుంచి అనేకమంది మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో అయ్యప్ప భక్తులు ఇలాంటి వారిని అడ్డుకుంటున్నారు. దీంతో శబరిమల ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా కొందరు మహిళలు ఎలాగోలా ఆలయంలోకి ప్రవేశించి ఇప్పటికే అయ్యప్ప దర్శనం చేసుకున్నారు.
ఈ క్రమంలో మంగళవారం ఇద్దరు మహిళలు, మగవారిలా వేషం ధరించి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు. తొమ్మిది మంది అయ్యప్ప భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తుండగా అనుమానం వచ్చిన ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు.
ఈ అయ్యప్ప భక్తుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని తెలింది. దాంతో ఆందోళనకారులు సదరు మహిళల్ని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో వారు వెనుతిరగాల్సి వచ్చింది. ఇదిలావుండగా, ఈ నెల 2వ తేదీన అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన కనకదుర్గ అనే మహిళపై ఆమె అత్త దాడి చేసింది.