శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (19:13 IST)

ఎల్లలుదాటిన దాతృత్వం : వలసకార్మికుల కోసం 3 రైళ్లు - 28 వేల మందికి ఆహారం

బాలీవుడు నటుడు సోనూ సూద్ మరోమారు తనలోని దాతృత్వాన్ని చూపారు. ఒక్కమాటలో చెప్పాలంటే సోనూ సూదా దాతృత్వం ఎల్లలు లేకుండా పోయింది. లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించేందుకు బస్సులు, విమానాలు, రైళ్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెల్సిందే. 
 
ఇపుడు మహారాష్ట్రను అతలాకుతలం చేసిన నిసర్గ తుఫాను దెబ్బకు నిరాశ్రయులుగా మిగిలిన వారికి ఆకలితీర్చుతున్నాడు. ముంబై తీర ప్రాంతంలోని సుమారు 28 వేల మందికి ఆహారం అందించడమే కాకుండా, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశాడు.
 
'నిసర్గ' తుఫాను ముంచుకు వస్తోందన్న వార్తలతో తన బృందం అప్రమత్తమైందని, తీర ప్రాంత ప్రజల ఆకలి తీర్చడంతో పాటు వారిని సురక్షిత ప్రాంతాల్లోని కాలేజీలు, పాఠశాలలకు తరలించామని సోనూసూద్ మీడియాకు వెల్లడించారు. 
 
అంతేకాదు, 'నిసర్గ' తుఫాను కారణంగా 200 మంది అస్సామీ వలస కూలీలు ముంబైలో చిక్కుకుపోయారని, వారిని షెల్టర్ కేంద్రాలకు తరలించామని తెలిపారు. 
 
ఇదిలావుంటే, లాక్డౌన్‌ నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులందరూ తమ ఇళ్లకు వెళ్లే వరకు సాయం చేస్తూనే ఉంటానని ప్రకటించాడు. ఆ మాటకు కట్టుబడి తాజాగా వలస కార్మికుల కోసం తాజాగా మరో మూడు రైళ్లను బుక్ చేశారు. 
 
బీహార్‌, యూపీ నుంచి ఉపాధి కోసం ముంబైకి వచ్చి ఉంటున్న వలస కార్మికులను తమ ఇళ్లకు చేర్చేందుకు ఈ రైళ్లను ఏర్పాటు చేశారు. తాను తొలిసారి కార్మికుల కోసం బస్సులను ఏర్పాటు చేసి, ముంబై నుంచి కర్ణాటకకు పంపినప్పటి నుంచి ఫోన్‌ కాల్స్‌ ఎక్కువయ్యాయని చెప్పారు. 
 
అందరికీ అందుబాటులో ఉండేలా తాను ఇటీవల ఓ టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశానని తెలిపారు. ఒకేసారి చాలా మందిని పంపించడానికే రైళ్లను బుక్ చేసినట్లు తెలిపారు. తాను చేస్తోన్న ఈ పనికి మద్దతు తెలుపుతూ సాయం చేస్తున్న సినీ పరిశ్రమ, ఇతర రంగాల్లోని స్నేహితులకు ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.