గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (10:44 IST)

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 122మంది మృతి

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం నిసర్గ తుపానుకు అతలాకుతలమైన ముంబైలో 49 మంది వైరస్‌ కారణంగా మృతిచెందగా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 122 మంది కన్నుమూశారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 2,587కి చేరింది. కేసుల సంఖ్య 74,860కి పెరిగింది. దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో మూడో వంతు ముంబయిలోనే నమోదుకావడం విషాదకరం. అలాగే పుణేలో బుధవారం కొత్తగా 11 మంది మృతి చెందారు. అక్కడ ఒకే రోజు ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి. ఇక్కడ మొత్తం మృతుల సంఖ్య 378గా నమోదైంది. 
 
ఇకపోతే.. భారత్‌లో కరోనా వైరస్‌ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. గత కొన్నిరోజులుగా దేశంలో రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 9304పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా వైరస్‌ వెలుగుచూసిన తర్వాత 24గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో గురువారం ఉదయానికి దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డ వారిసంఖ్య 2,16,919కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. 
 
గత కొన్నిరోజులుగా దేశంలో ప్రతిరోజు 200పైగా మరణాలు సంభవిస్తున్నాయి. గడచిన 24గంటల్లో అత్యధికంగా 260మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకేరోజు ఈ స్థాయిలో మరణించడం కూడా ఇదే తొలిసారి. దేశంలో ఇప్పటివరకు కోవిడ్‌ సోకి 6075మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో కరోనా మరణాల్లో ప్రపంచంలో ఇప్పటివరకు 13స్థానంలో కొనసాగిన భారత్‌, తాజాగా 12స్థానానికి ఎగబాకింది.