శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (21:52 IST)

భారత్‌లో కరోనా దూకుడు... 14 రోజుల్లోనే లక్ష పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ దూకుడు కొనసాగుతోంది. ఫలితంగా కేవలం 14 రోజుల్లో లక్ష కొత్త కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా, దేశంలో కరోనా వైరస్ వ్యాపించిన నెలల వ్యవధిలో లక్ష కేసులు దాటితే గత 14 రోజుల్లో లక్ష నుంచి 2 లక్షలకు చేరాయి. ఈ దూకుడు కేంద్ర రాష్ట్రాలతో పాటు.. దేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 
 
మరోవైపు, గత 24 గంటల వ్యవధిలో భారత్‌లో 8,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రపంచంలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న టాప్ 10 దేశాల్లో భారత్‌ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. ఆరో స్థానంలో 2.33 లక్షల కరోనా పాజిటివ్ కేసులతో ఇటలీ ఉండటం గమనార్హం. 
 
అయితే, భారత్‌లో ఇప్పటిలానే కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగితే ఇటలీని పక్కకు నెట్టేసి ఆరో స్థానానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదనేది వైద్య నిపుణుల అంచనాగా వుంది. గత మూడు రోజులుగా భారత్‌లో 8 వేలకు మించి కరోనా పాజిటివ్ నమోదవుతున్నాయి. 
 
భారత్‌లో కరోనా హాట్ స్పాట్‌గా 70,000 పైచిలుకు కేసులతో మహారాష్ట్ర ఉన్న సంగతి తెలిసిందే. అలాగే తమిళనాడులో 24 వేల కేసులు ఉన్నాయి. ఒక్క చెన్నై నగరంలోనే దాదాపుగా 17 వేల కేసులు నమోదైవున్నాయి. ఢిల్లీలో కూడా కరోనా దూకుడు ఇలానేవుంది. దీంతో సరిహద్దులను కూడా మూసివేయడం జరిగింది.