బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : శనివారం, 8 మే 2021 (20:28 IST)

కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే తాట తీయండి: ఏపీ ప్రభుత్వం వార్నింగ్

అమరావతి: కోవిడ్ మీద జరుగుతున్న దుష్ప్రచారాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. తప్పుడు ప్రచారాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. తప్పుడు ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

విపత్తు సమయంలో తప్పుడు ప్రచారాలు చేసేవారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజలను భయాబ్రాంతులకు గురిచేస్తే సహించేది లేదని ప్రభుత్వం హెచ్చరించింది. కరోనాపై, వ్యాక్సినేషన్ మీద తప్పుడు ప్రచారాలను నిలువరించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.
 
కర్నూలులో N440k వైరస్ ఉందని వ్యాఖ్యానించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రస్థుతం కొత్త స్ట్రెయిన్ ఎన్-440కె వైరస్ కర్నూలు నుంచి వచ్చి ఇప్పుడు దేశమంతా వ్యాపిస్తుందని జాతీయమీడియా, దేశంలోని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయని టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి అన్నారు.
 
వైసీపీ ప్రభుత్వం ఈ కొత్తరకం వైరస్‌ను ఏ విధంగా అరికట్టాలో ఆలోచించి తగిన చర్యలు తీసుకోకుండా అసలు N440k వైరస్ లేనేలేదని, మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా రోగులు ఆక్సిజన్ కొరతతో చనిపోతున్న విషయాన్ని వైఎస్ జగన్ కప్పిపెట్టాలనుకుంటున్నారని ఆయన అన్నారు.
 
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం, కోర్టుల చేత మొట్టికాయలు తినడం జగన్‌కు పరిపాటి అయిందని ఆయన వ్యాఖ్యానించారు.