సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 30 జనవరి 2021 (14:26 IST)

ఛాతీపై తాకినా బాలిక శరీరం తగల్లేదు కదా, అది నేరం కాదు, మహిళా న్యాయమూర్తి వివాదాస్పద తీర్పులు: సుప్రీం షాక్

బాలికలను ఛాతీ పైగాన్ని దుస్తుల పైనుంచి తాకితే అదేమీ నేరం కాదనీ, ఐదేళ్ల బాలిక ముందు ఓ మగాడు ప్యాంటు జిప్ ఓపెన్ చేసినా అది నేరం కాదంటూ ఇటీవల వివాదాస్పద తీర్పులనిచ్చిన న్యాయమూర్తి జస్టిస్ పుష్పపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైకోర్టులో ఆమెకి శాశ్వత హోదా కల్పించేలా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సున తిరిగి వెనక్కి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
కాగా జస్టిస్ పుష్ప ఇటీవల సంచలన, వివాదాస్పద తీర్పులనిచ్చారు. బాలికలను దుస్తులపై నుంచి ఛాతీ భాగాన్ని తాకితే అది లైంగిక వేధింపులు కిందకు రావంటూ జస్టిస్ పుష్ప తీర్పునిచ్చారు. శరీర భాగాలను నేరుగా తాకితేనే పోక్సో చట్టం వర్తిస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
 
12 ఏళ్ల బాలికను 39 ఏళ్ల వ్యక్తి లైంగికంగా వేధించాడన్న కేసులో హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో జనవరి 19న తీర్పు వచ్చింది. నేరుగా శరీరాన్ని తాకితేనే లైంగిక పరమైన ఉద్దేశంగా పరిగణించాల్సి ఉంటుందని జస్టిస్ పుష్ప వివరించారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా నాగ్ పూర్ బెంచ్ తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పు సహేతుకంగా లేదని స్పష్టం చేసింది. వాదనలు విన్న తర్వాత ఆ తీర్పుపై స్టే ఇచ్చింది.
 
భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్ 354 ప్రకారం 'ఒక మహిళ శీలాన్ని చెర‌చాల‌నే ఉద్దేశంలో దాడి చేయడాన్ని నేరంగా పరిగణిస్తుంది. దీనికి ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది. కానీ పన్నెండేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో త‌న‌కు విధించిన శిక్షపై 39 ఏళ్ల వ్యక్తి బాంబే హైకోర్టులో అప్పీల్ చేశాడు. ఈ కేసుపై విచార‌ణ జ‌రిపిన నాగ్‌పూర్ బెంచ్ "శరీరాన్ని తాకకుండా చేసిన లైంగిక నేరాన్ని లైంగిక దాడిగా భావించలేమని పేర్కొంటూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ప్రస్తుతం సుప్రీం కోర్టు స్టే విధించింది.