సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (15:50 IST)

'15 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌' : నేడు జాబిల్లిపై విక్రమ్ ల్యాండింగ్ (video)

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రాజెక్టు ప్రయాణానికి నేటితో తెరపడనుంది. శుక్రవారం అర్థరాత్రి తర్వాత ఈ చారిత్రక ఘట్టానికి తేరలేవనుంది. ఇస్రో శాస్త్రవేత్తల కఠోరశ్రమకు ఫలితం దక్కాలని.. 48 రోజుల అద్భుత ప్రయాణం విజయవంతంగా ముగియాలని 130 కోట్ల మంది భారతీయులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 
 
అలాగే, ప్రపంచ దేశాల చూపు కూడా విక్రమ్‌ వైపే ఉంది. నిర్ణీత షెడ్యూలు ప్రకారం.. చంద్రయాన్‌-2లోని విక్రమ్‌ ల్యాండర్‌ను గురువారం నాటికి చంద్రుడికి 35 కి.మీ. దగ్గరగా, 101 కి.మీ. దూరంగా ఉండే కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఆర్బిటర్‌ చంద్రుడికి 96 కి.మీ దగ్గరగా, 125 కి.మీ దూరంగా ఉండే చంద్రకక్ష్యలో పరిభ్రమిస్తోంది. మిగిలింది.. విక్రమ్‌ను చంద్రుడిపై దించడమే!
 
అయితే, శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత అంటే శనివారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి రెండు గంటల నడుమ చంద్రుడి దక్షిణ ధ్రువంపై 70.9 డిగ్రీల దక్షిణ, 22.7 డిగ్రీల తూర్పు అక్షాంశంలో మాంజీనస్‌-సి, సీంపేలియ్‌స-ఎన్‌ అనే రెండు చంద్ర బిలాల మధ్య ఎగుడుదిగుళ్లు లేని, సమతులంగా ఉండే స్థలాన్ని ఆర్బిటర్‌కు అమర్చిన అర్బిటర్‌ హై రిజల్యూషన్‌ కెమెరా (ఓహెచ్‌ఆర్‌బీ) ద్వారా అన్వేషించనున్నారు. 
 
అక్కడ విక్రమ్‌ దిగేందుకు అనువైన స్థలం లభ్యంకాకపోతే 67.7 డిగ్రీల దక్షిణ, 18.4 డిగ్రీల పడమరగా ఉన్న ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి సమతులంగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నట్లు ఇస్రోకు చెందిన ఓ సీనియర్‌ శాస్త్రవేత్త వెల్లడించారు. అలా అరగంటలో స్థల అన్వేషణ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత 1.30 నుంచి 2.30 గంటల మధ్య విక్రమ్‌ ల్యాండర్‌ను జాబిల్లిపై దించే ప్రయత్నం చేపట్టనున్నారు. ల్యాండర్‌ వేగాన్ని సెకనుకు 2 మీటర్లకు తగ్గించి నెమ్మదిగా చంద్రుని ఉపరితలాన్ని తాకేలా చేస్తారు. 
 
1.40 నుంచి 1.55 గంటల మధ్య... అంటే 15 నిమిషాలపాటు ఈ ల్యాండింగ్‌ ప్రక్రియ జరగనుంది. ఇస్రో చీఫ్‌ కె.శివన్‌ '15 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌'గా అభివర్ణించిన సమయం ఇదే. ఎందుకంటే.. ఈ 48 రోజుల ప్రయాణం ఒక ఎత్తు అయితే చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ దిగే 15 నిమిషాలు అత్యంత కీలకమైనవి. ఈ 15 నిమిషాలలో ప్రతి క్షణం ఇస్రో శాస్త్రవేత్తలకే కాదు.. ఈ ల్యాండింగ్‌ను వీక్షించే ప్రతి ఒక్కరికి ఊపిరిబిగబట్టే ఉత్కంఠ కలగజేయనుంది.
 
ఆ పావు గంట ఉత్కంఠ ఎందుకంటే... భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్టే చంద్రుడికి కూడా ఆకర్షణ శక్తి (భూమితో పోలిస్తే చాలా తక్కువగా) ఉంటుంది. ప్రస్తుతం చంద్ర కక్ష్యలో తిరుగుతున్న విక్రమ్‌ ల్యాండర్‌.. మామూలుగా జాబిలి ఉపరితలంపై దిగే ప్రయత్నం చేస్తే ఆ ఆకర్షణ శక్తికి వేగంగా వెళ్లి కూలిపోతుంది. అలా కూలిపోకుండా ఉండేందుకు విక్రమ్‌లోని డైరెక్షనల్‌ థ్రస్టర్లను మండించడం ద్వారా ఉపగమన వేగాన్ని కొనసాగిస్తూ అది చంద్రుడిపై నెమ్మదిగా దిగేలా ఇస్రో శాస్త్రజ్ఞులు ఏర్పాట్లు చేశారు. 
 
విక్రమ్‌ అలా నెమ్మదిగా దిగడానికి పావుగంట సమయం పడుతుంది. ఇంత క్లిష్టం కనుకనే ల్యాండింగ్‌ను '15 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్'గా వ్యవహరిస్తున్నారు. శాస్త్రజ్ఞుల కృషి ఫలించి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే.. విక్రమ్‌ విసురుగా వెళ్లి చంద్రుడిపై కూలిపోకుండా, మృదువుగా ల్యాండ్‌ అవుతుంది. ఇలా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన ఘనత ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా దేశాలకు మాత్రమే ఉంది.