శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2019 (17:43 IST)

పుట్టగొడుగుల కోసం వెళ్లిన ఉపాధ్యాయుడు పులికి బలైపోయాడు... చంపి పీక్కు తినేసింది...

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విషాదకర సంఘటన జరిగింది. పుట్టగొడుగుల కోసం ఫారెస్టుకు వెళ్లిన ఓ ఉపాధ్యాయుడుని పెద్దపులి చంపేసి... పీక్కుతినేసింది. ఈ ఘటన సియోనీ జిల్లాలో ఉన్న టైగర్ రిజర్వు ఫారెస్టులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సియోని జిల్లాలోని పెంచ్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ సమీప గ్రామానికి చెందిన మనోజ్ ధుర్వే అనే 23 యేళ్ల వ్యక్తి స్థానికంగా ఉండే ఓ కాలేజీలో విజిటింగ్ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. 
 
ఈ రిజర్వు ఫారెస్టుకు సమీపంలో ఆయనకు కొంత వ్యవసాయ భూమి ఉంది. ఇందులో పుట్టగొడుగులు మొలకెత్తుతుంటాయి. వీటిని తెచ్చుకునేందుకు మనోజ్ ధుర్వే వెళ్లాడు. మధ్యాహ్నం 11 గంటల సమయంలో సమీపంలోని అడవిలోకి వెళ్ళి తిరిగి ఇంటికిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు గ్రామస్తులంతా కలిసి అతని కోసం గాలించసాగారు.
 
ఈ గాలింపు చర్యలో భాగంగా, రాత్రి 8.30 గంటల సమయంలో అడవిలో ఒక చోట అతని పాదరక్షలను గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి ఒక శరీరాన్ని లాక్కెళ్లిన్నట్టు రక్తపు మరకలు ఉండటంతో వాటిని అనుసరిస్తూ వెళ్లగా, మృతదేహం కనిపించింది. అది అతనిదేనని గుర్తించారు. 
 
అతన్ని పులి కొట్టి చంపేసి, దేహంలోని కండర భాగాలను పీక్కు తినేసింది. దీంతో ముఖం, కాళ్లు మాత్రమే మిగిలాయి. ఈ దారుణాన్ని చూసి భయభ్రాంతులకు లోనైన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు చేరవేశారు. ప్రస్తుతం అటవీ సిబ్బంది ఆ పులి ఆచూకీని కనిపెట్టే పనిలో ఉన్నారు. అయితే, భారీగా కురుస్తున్న వర్షాలు వారి ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తున్నాయి.

కాగా, ఇటీవలి కాలంలో ఈ టైగర్ ఫారెస్టులో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చాలా పులులు సురక్షిత ప్రాంతం నుంచి బయటకు వచ్చాయని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఇవి మనుషులు, పశువులపై దాడి చేస్తున్నాయని చెప్పారు.