గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:49 IST)

5న దీపాలు వెలిగిస్తున్నారా? ఇలా చేయకుంటే చేతులు కాలిపోతాయ్... జాగ్రత్త!!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మరోమారు దేశ ప్రజలందరూ తమ ఐక్యతను చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూను పాటించి తమ ఐక్యతను చాటారు. అలాగే, ఇపుడు మరోమారు ఆదివారం రాత్రి దీపాలు వెలిగించి మరోమారు ఇదే తరహా ఐక్యతను చాటనున్నారు. 
 
ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారితో దేశం యావత్తూ తమతమ ఇళ్ళకే పరిమితమైంది. లాక్‌డౌన్ పుణ్యమాని ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. మహమ్మారి కరోనా వైరస్‌ని తరిమికొట్టేందుకు దేశ ప్ర‌జ‌లంద‌రి ఐక్య‌త‌కు సూచిక‌గా ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు దీపం వెలిగించే కార్యక్రమం జరుగనుంది. ప్ర‌ధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో దేశ‌వ్యాప్తంగా ప్రజలంతా పాల్గొనున్నారు. 
 
ఆదివారం రాత్రి 9 గంటలకు ఇంట్లోని కేవలం లైట్లను మాత్రమే బంద్‌ చేసి.. 9 నిమిషాల పాటు కొవ్వొత్తి, దీపం, టార్చ్‌లైట్‌ లేదా మొబైల్‌ ఫ్లాష్‌ లైట్‌ రూపంలో దీపాలు వెలిగించాలని ప్రధాని కోరారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం దేశ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
ఆల్కహాలిక్ శానిటైజర్‌ను వాడేముందు మీ చుట్టూ అగ్నితో సంబంధం ఉన్న వాటికి దూరంగా ఉండాలి. మండే వాటికి దగ్గరగా వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు మంటలు చెలరేగే అవకాశం ఉంది. 'ఏప్రిల్‌ 5న రాత్రి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించేముందు తగిన జాగ్రత్తలు తీసుకోండి. దీపాలు వెలిగించే ముందు చేతులను ఆల్కహాల్‌తో తయారైన శానిటైజర్లతోకాకుండా సబ్బులతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని' అని దేశ ప్రజలకు భారత ఆర్మీ సూచన చేసింది.