మాస్క్ ధరించలేదని మేకను అరెస్టు చేసిన పోలీసులు.. ఎక్కడ?
కొన్నిసార్లు పోలీసుల ప్రవర్తన, వారి చేష్టలు చూస్తుంటే నవ్వొస్తుంది. ఇలాంటి వారా మనకు రక్షణ కల్పించేది అనే అనుమానం కలుగుతుంది. తాజాగా పోలీసులు చేసిన ఓ పని ప్రతి ఒక్కరికీ నవ్వుతో పాటు.. ఆగ్రహం తెప్పిస్తుంది. ముఖానికి మాస్క్ ధరించలేదని ఓ మేకను అరెస్టు చేసి ఠాణాకు తీసుకెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఈ సంఘటన ఇపుడు సోషల్ మీడియాలో వైరల అవుతోంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రంలోని కాన్పూర్, బికన్‌గంజ్‌కి చెందిన ఓ వ్యక్తి తన మేకను తీసుకొని రోడ్డు మీద నడుస్తుండగా పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. తిరుగుతున్న మేకను అరెస్టు చేశారు. ఆ భయంతో అక్కడ నుంచి పారిపోయిన యజమాని మేక కోసం స్టేషన్‌కు పోకతప్పలేదు.
సార్ నా మేకను ఎందుకు అరెస్టు చేశారు అని అడిగితే.. 'మేక మాస్క్ లేకుండా బయట తిరుగుతుంది. అందుకే అరెస్ట్ చేశాం' అని సమాధానం ఇచ్చారు. దీంతో ఆ యజమాని నోరెళ్లబెట్టాడు. తప్పు అయిపోయింది సార్ మళ్లీ ఇలా జరగకుండా చూసుకుంటానని బతిమిలాడి ఎలాగోల మేకను విడిపించుకున్నాడు.
కానీ యూపీ పోలీసుల మీద మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ అవుతున్నాయి. దీనికి వారు.. రివర్స్ డ్రామా ఆడారు. మేక యజమాని మాస్క్ పెట్టుకోకపోవడంతో అతన్ని అరెస్టు చేసేలోపు పరార్ అయ్యాడు. అందుకని మేకను తీసుకురావాల్సి వచ్చిందని కవర్ చేసుకున్నారు పోలీసులు.